‘కబడ్డీ’ కూతకు వేళైంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ నేటితో తెరలేవనుంది. తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మ్యాచ్‌తో లీగ్ మొదలవనుంది.ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఆరంభమవుతుంది. రాత్రి 9 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో జరిగే రెండో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ, యు ముంబాలు తలపడనున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.గత సీజన్‌ల కంటే భిన్నంగా.. పీకేఎల్ 11ను మూడు వేదికలకే పరిమితం చేస్తున్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నవంబర్ 9 వరకు పోటీలు జరుగుతాయి. నోయిడా, పుణేలు తర్వాతి దశ పోటీలకు ఆతిథ్యం ఇస్తాయి. 12 టీమ్‌లతో పీకేఆల్ 11 జరగనుంది. లీగ్ దశలో 132 మ్యాచ్‌లు జరగనుండగా.. ప్లే ఆఫ్స్ (ఎలిమినేటర్-1, ఎలిమినేటర్-2, రెండు సెమీఫైనల్స్, ఫైనల్) మ్యాచ్‌లతో కలిపి ఓవరాల్‌గా 137 మ్యాచ్‌లు ఉంటాయి.తెలుగు టైటాన్స్ టీమ్ ఇప్పటివరకూ పీకేఎల్ టైటిల్‌ను దక్కించుకోలేకపోయింది. రెండో సీజన్‌లో మూడో స్థానంలో నిలవడమే అత్యుత్తమ ప్రదర్శన. గత మూడు సీజన్లుగా అయితే చెత్త ప్రదర్శనతో 12వ స్థానంలో నిలిచింది. 10 సీజన్లలో 192 మ్యాచ్‌లు ఆడితే.. 56 మాత్రమే గెలిచి, ఏకంగా 116 ఓడిపోయింది. అయితే ఈసారి కథ మారుస్తామని టైటాన్స్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. దబంగ్ ఢిల్లీకి టైటిల్ అందించిన కోచ్ కృషన్ కుమార్ హుడా ఈసారి టైటాన్స్ కోచ్‌గా రావడం సానుకూలాంశం. కృషన్ నేతృత్వంలో టీమ్ రాత మారుతుందా? లేదో చూడాలి.