భారత ప్రజలకు బంగారం అంటే ఒక భావోద్వేగం. ప్రతి పండగ, శుభకార్యాల్లో బంగారానికి ప్రత్యేక స్థానం కల్పిస్తారు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలు ధరిస్తారు. ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత గౌరవ సూచికం. పండగలు, శుభకార్యాలు, వేడుకల్లో ఎక్కువగా పసిడి, వెండి కొనుగోలు చేస్తుంటారు. మన దేశంలో ప్రధానంగా దీపావళికి ముందు వచ్చే ధన్‌తేరాస్ సందర్భంగా బంగారం ఎక్కువగా కొంటుంటారు. ఆ రోజు బంగారం కొంటే మంచిదని భావిస్తారు. మరో వారంలో ఈ పర్వదినం వస్తోంది. దీంతో దేశ ప్రజలు బంగారం కొనేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఇలాంటి తరుణంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. రికార్డ్ గరిష్టాలకు చేరుకుని భయపెడుతున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే తులం బంగారం ధర రూ.2000 పైన పెరిగింది. ప్రస్తుతం అక్టోబర్ 20వ తేదీన బంగారం, వెండి ధరలు హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2721 డాలర్లకు చేరింది. నాలుగు రోజుల్లోనే 100 డాలర్ల వరకు పెరిగింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 33.73 డాలర్లకు ఎగబాకింది. మరోవైపు. మన రూపాయి విలువ కాస్త పుంజుకుని రూ.84.078 వద్ద అమ్ముడవుతోంది.
దేశీయంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 22 క్యారెట్ల బంగారం రేటు రూ.400 పెరిగింది. గత నాలుగు రోజుల్లో చూసుకుంటే ఏకంగా రూ.1800 పైన పెరిగింది. దీంతో తులం రేటు రూ. 72 వేల 800 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఇవాళ మరో రూ.480 పెరగడంతో నాలుగు రోజుల్లోనే రూ.2000 పైన ఎగబాకింది. ప్రస్తుతం ప్యూర్ గోల్డ్ రేటు తులానికి రూ. 79 వేల 420 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠాలను తాకింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బంగారం ధర 22 క్యారెట్లకు రూ. 380 పెరగడంతో రూ. 72 వేల 930 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ఢిల్లీలో 10 గ్రాములకు రూ.430 పెరగడంతో రూ. 79 వేల 570 వద్ద ట్రేడవుతోంది.
బంగారం బాటలోనే వెండి ధరలు సైతం మళ్లీ పెరిగాయి. మూడు రోజుల్లోనే కిలో వెండి రేటు ఏకంగా రూ.5000 పెరిగింది. ఇవాళ కిలో సిల్వర్ ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 2000 పెరిగి రూ. 1,07,000 వద్దకు చేరింది. ఇక ఢిల్లీలో చూస్తే కిలో సిల్వర్ రేటు ఇవాళ రూ.500 పెరిగింది. దీంతో కిలో ధర రూ. 99 వేల 500 స్థాయికి చేరింది.