రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు గడువు మరో 8 రోజులు మాత్రమే. అక్టోబర్ 31వ తేదీలోపు రిటైన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంది. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చింది. నిబంధనలకు అనుగుణంగా నేరుగా నిర్ణయించిన ధరతో రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా ఫ్రాంచైజీ దక్కించుకోవచ్చు. అయితే రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లుగా నిర్ణయించింది. రిటెన్షన్ నిర్ణీత ధర కంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చే ఆలోచన ఫ్రాంచైజీలకు బీసీసీఐ వదిలేసింది. అయితే గతంలో ఫ్రాంచైజీలకు కలిసొచ్చే ఓ నిబంధనను బీసీసీఐ ఈసారి తొలిగించనున్నట్లు తెలుస్తోంది. 2022 మెగావేలానికి బీసీసీఐ ఫ్రాంచైజీలకు 'లెస్సర్ ఎమౌంట్' రూల్ అమలు చేసింది. అంటే నిర్ణీత ధర కంటే ఎక్కువ మొత్తాన్ని ఫ్రాంచైజీ ఆటగాళ్లకు చెల్లించినా, దాన్ని పర్స్ నుంచి మినహాయించింది.
ఉదాహరణకు.. 2022లో ఓ ప్లేయర్ అత్యధిక ధరగా రూ.15 కోట్లు నిర్ణయించింది. విరాట్ కోహ్లికి రూ.17 కోట్లు, రోహిత్ శర్మకు రూ.16 కోట్లు చెల్లించారు. అయితే సదరు ఫ్రాంచైజీలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తమ మొత్తం నుంచి రూ.15 కోట్లు మాత్రమే కోత విధించింది. కానీ ఈసారి అలా కుదరదు. తమ మొత్తంలో ఆర్సీబీ రూ.17 కోట్లు, ముంబై రూ.16 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ప్లేయర్లు హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మలకు వరుసగా రూ. 23 కోట్లు, రూ. 18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకోవాలని చూస్తోంది.అయితే గత నిబంధనల ప్రకారం ఈ ఆటగాళ్లకు ఎక్కువ ధర వెచ్చించినా, ఎస్‌ఆర్‌హెచ్ తమ పర్స్ వ్యాల్యూ నుంచి రూ.43 కోట్లు (నిర్ణీత ధర రూ.18 కోట్లు + రూ. 14 కోట్లు+ రూ. 11 కోట్లు) మాత్రమే కోల్పోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు తమ రూ.120 కోట్లలో రూ. 55 కోట్లు వదులకోవాల్సి ఉంటుంది.