పుణే టెస్టులో టీమిండియా యువ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లతో చెలరేగాడు. సుందర్ విజృంభణతో న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 259 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ ఇన్నింగ్స్ లో తొలి మూడు వికెట్లను రవిచంద్రన్ అశ్విన్ పడగొట్టగా... మిగతా ఏడు వికెట్లు వరుసగా సుందర్ ఖాతాలో పడ్డాయి. సుందర్ ఆఫ్ స్పిన్ ను ఆడేందుకు న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ పిచ్ స్పిన్ కు అనుకూలించడంతో ఏ దశలోనూ ఆ జట్టు సౌకర్యవంతంగా కనిపించలేదు. కివీస్ జట్టులో ఓపెనర్ డెవాన్ కాన్వే 76, రచిన్ రవీంద్ర 65 రాణించారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం... టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ సున్నా పరుగులకే అవుట్ కావడంతో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 9 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ (0) కివీస్ పేసర్ టిమ్ సౌథీ బంతికి బౌల్డయ్యాడు.తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 1 వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 6, శుభ్ మాన్ గిల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.