ఉత్కంఠకు తెరపడింది. ఐపీఎల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిటెన్షన్ ప్లేయర్ల జాబితా ఆదివారం విడుదలైంది. ఆటగాళ్ల సామర్థ్యాన్ని అంచనా వేస్తూ, ఆర్థిక వ్యూహాలతో పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించింది.ఊహించినట్లుగానే కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా ఆరుగురు ప్లేయర్లను, పంజాబ్ కింగ్స్ అత్యల్పంగా ఇద్దరిని మాత్రమే అట్టిపెట్టుకుంది. ఎంఎస్ ధోనీ వచ్చే సీజన్‌లోనూ సీఎస్కేలో కొనసాగనున్నాడు.సన్‌రైజర్స్ హైదరాబాద్ అయిదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. ముగ్గురు విదేశీ స్టార్ ప్లేయర్లను, ఇద్దరు యువ భారత ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. హెన్రిచ్ క్లాసెన్‌కు రూ. 23 కోట్లు, ప్యాట్ కమిన్స్‌కు రూ. 18 కోట్లు, అభిషేక్ శర్మకు రూ. 14 కోట్లు, ట్రావిస్ హెడ్‌కు రూ. 14 కోట్లు, నితీశ్ కుమార్ రెడ్డికి రూ.6 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది. రూ.120 కోట్ల పర్స్ వ్యాల్యూలో రూ.75 కోట్లను రిటెన్షన్‌కు ఖర్చు పెట్టిన ఎస్‌ఆర్‌హెచ్ రూ.45 కోట్లు, ఒక ఆర్‌టీఎమ్‌తో మెగా వేలంలో బరిలోకి దిగనుంది.
ఇప్పటికే అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లను రిటైన్ చేసుకోవడంతో మెగా ఆక్షన్‌లో సన్‌రైజర్స్ ఆర్‌టీఎమ్‌ను తమ అన్‌క్యాప్డ్ ప్లేయర్లపైనే ఉపయోగించడానికి అవకాశం మిగిలింది. అయితే మిగిలిన రూ.45 కోట్లతో మెగా వేలంలో ఆటగాళ్లను ఎస్‌ఆర్‌హెచ్ సీఈవో కావ్య మారన్ ఎలా సొంతం చేసుకుంటుందనేది అసలు ప్రశ్న. సాధారణంగా ఓ ఫ్రాంచైజీలో 25 మంది ఆటగాళ్లు ఉంటారు. అందులో గరిష్టంగా 8 మందికి మాత్రమే ఛాన్స్. ఇప్పటికే సన్‌రైజర్స్‌కు ముగ్గురు విదేశీ, ఇద్దరు ఇండియన్ ప్లేయర్లు ఉన్నారు.
ఈ నేపథ్యంలో మెగా వేలంలో 15 మంది భారత ప్లేయర్లను, 5గురు విదేశీ ఆటగాళ్లను సన్‌రైజర్స్ దక్కించుకోవాల్సి ఉంది. ఈ సారి ఆటగాళ్ల కనీస ధర రూ.20 లక్షలకు బదులుగా రూ.30 లక్షలతో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అంతేగాక కొందరు స్టార్ ఆటగాళ్లు కనీసం ధర రూ.2 కోట్లు, రూ.కోటి, రూ.50 లక్షలతో కూడా వేలానికి వస్తారు. ఆక్షన్‌లో ఇతర ఫ్రాంచైజీల నుంచి పోటీని ఎదుర్కొన్ని సన్‌రైజర్స్ తమ జట్టు బలాన్ని ఎలా పెంచుతుందని ఆసక్తికరంగా మారింది.
డెత్ స్పెషలిస్ట్ బౌలర్ నటరాజన్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లను తిరిగి సొంతం చేసుకోవాలంటే సన్‌రైజర్స్ భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అంతేగాక ఎస్‌ఆర్‌హెచ్‌కు కనీసం మరో ఇద్దరు ఫారెన్ స్టార్ ప్లేయర్లు, నైపుణ్యం ఉన్న బౌలింగ్ దళం అవసరం. ఈ నేపథ్యంలో ఆర్‌టీఎమ్‌తో కాకుండా అయిదుగురు స్టార్లను నేరుగా రిటైన్ చేసుకున్న కావ్య మారన్ వ్యూహం ఫ్రాంచైజీపై ప్రతికూలత చూపే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే సుదీర్ఘ ప్రణాళికతలో నితీశ్, అభిషేక్ వంటి యువ ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న కావ్య వ్యూహాన్ని ప్రశంసిస్తున్నారు.