తెలుగువారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి కస్తూరిపై తమిళనాడులోని చెన్నై, మదురై సహా పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. న్యాయ నిపుణులతో చర్చించిన పోలీసులు.. ఆమెకు సమన్లు జారీచేశారు. ఇండియా తెలుగు సమ్మేళనం తరఫున చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కస్తూరిపై ఫిర్యాదు చేయడంతో ఆమెపై 192, 196(1ఏ)3 53 ,353(2) సెక్షన్‌ల కింద కేసు నమోదుచేశారు పోలీసులు. విచారణలో భాగంగా ఆమెను పోలీస్ కార్యాలయానికి రప్పించడానికి సమన్లు ఇచ్చేందుకు పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. కానీ, ఇంటికి తాళం వేసి ఉండగా.. ఫోన్‌లో ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించారు. ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో వెనుదిరిగారు. కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లడంతో పరారీలో ఉన్న ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కాగా, కస్తూరి ఇప్పటికే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. తన వ్యాఖ్యలు తెలుగు ప్రజల మనోభావాలను గాయపరిచినట్లయితే వారికి క్షమాపణ చెబుతున్నానని ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. తెలుగు ప్రజలు అంటే తనకు చాలా గౌరవమని, వారిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. అంతేకాదు, అసత్య ప్రచారం వల్ల తెలుగు ప్రజలు తనను అపార్థం చేసుకుంటున్నారని.. తన వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని కస్తూరి వివరణ ఇచ్చారు
‘తమిళనాడులో ఇప్పుడు ద్రవిడ ఐడియాలజీ నడుస్తోంది... సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేవాళ్లు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. రోజుకు ఒకరితో అక్రమ సంబంధం అంటగడుతున్నారు... మద్యం అలవాటే లేకున్నా.. నేను తాగుబోతునని ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్న డీఎంకే పార్టీపై విమర్శలు చేసినందుకే నాపై ఇలాంటి అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు’ అని కస్తూరీ వ్యాఖ్యానించారు.
ఇటీవల తమిళనాడులోని స్థానిక బ్రహ్మణుల సమ్మేళనానికి హాజరైన కస్తూరి తెలుగువారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వాళ్లని తక్కువచేసి మాట్లాడారు. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే తమిళనాడులో స్థిరపడిన అరుంథతియార్ సామాజిక వర్గానికి చెందిన ఆంధ్రులపై నామ్ తమిళర్ కట్చి చీఫ్ కో-ఆర్డినేటర్ సీమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. విమర్శలు ఎదుర్కొంటున్నారు