ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి నేతల్ని టార్గెట్ చేసిన సోషల్ మీడియా కార్యకర్తల్ని పోలీసులు వెంటాడుతున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేస్తున్నారు.వీటిపై వైసీపీ ఇప్పటికే భగ్గుమంటోంది. ఇప్పటికే మాజీ సీఎం వైఎస్ జగన్ తో పాటు ఇతర వైసీపీ నేతలు కూడా దీనిపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. అలాంటి సమయంలో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ సొంత పార్టీకి షాకిచ్చారు.పల్నాడు జిల్లా నకరికల్లులో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని నూజివీడు పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. అయితే ఆయన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్లో ఉండగా అరెస్టు చేశారు. దీనిపై అంబటి స్పందిస్తూ తానే స్వయంగా ఆయన్ను పోలీసులకు అప్పగించానని చెప్పారు. దీంతో అంబటి వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీకే షాక్ గా మారాయి. సోషల్ కార్యకర్త రాజశేఖర్ రెడ్డి కోసం నాలుగు రోజులుగా పోలీసులు వెతుకుతున్నారని అంబటి తెలిపారు.
చట్ట ప్రకారం ఏ స్టేషన్లో కేసు నమోదు చేశారో చూపించి తీసుకు వెళ్ళమని తానే చెప్పానని అంబటి వెల్లడించారు. ఉదయం 10:30 నిమిషాలకు నా ఆఫీసు కి వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని తెలిపారు.పోలీసులు కొన్ని చోట్ల రౌడీలుగా మారి వైసీపీ కార్యకర్తలను కొడుతున్నారని అంబటి ఆరోపించారు. సీతారామాంనేయులు అనే వ్యక్తి ఈ నెల 9వ తేదీన వైసీపీ కార్యకర్త పై పోలీసులకు ఫిర్యాదు చేశాడని, హోంమంత్రి అనితపై అసభ్యకరంగా పోస్ట్ లు పెట్టాడని కేసు పెట్టారని వెల్లడించారు.టీడీపీకి చెందిన నాయకుడు సీతారామంజనేయులు వైసీపీ కార్యకర్త పై ఫిర్యాదు చేశాడని, అదే వైసీపీ నాయకులపై అసభ్యకరంగా పోస్ట్ లు పెట్టిన వారి పై చర్యలు లేవని అంబటి రాంబాబు విమర్శించారు. తనపై తన కుటుంబ సభ్యుల పై అసభ్య పద జాలంతో పోస్ట్ లు పెట్టారని గుర్తుచేశారు. టీడీపీ కి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేయరని ప్రశ్నించారు. కూటమి ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదన్నారు.