పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కృష్ణా తీరంలో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ మహా సత్సంగంలో విజయవాడ నగరం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా ధ్యాన, గాన, జ్ఞానాలతో విజయవాడ ప్రజలు పులకించిపోయారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు చెందిన బృందం ఆలపించిన మహామృత్యుంజయ మంత్రం, శివ సంకీర్తనతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ మహా సత్సంగం ప్రారంభమైంది. శివుడికి అత్యంత ఇష్టమైన కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనది కాగా.. ఆ సందర్భంగా సత్సంగంలో శివ విష్ణు సంకీర్తనలు మారుమోగాయి. రఘుపతే రాఘవ రాజారామ అంటూ భద్రాచలరాముని సంకీర్తన సాగుతుండగా సభాస్థలిలో గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా మానవ జీవితం చాలా చిన్నదని.. దాన్ని ఉత్సవంగా మలచుకోవాలని గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ప్రభోదించారు. ఆధ్యాత్మికత, సేవ, సత్సంగం అందుకు ఉపకరిస్తాయని తెలిపారు. ఇక 1981లో ఇదే రోజున వేదవిజ్ఞాన మహావిద్యా పీఠం పేరుతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రారంభమైన విషయాన్ని శ్రీశ్రీ రవిశంకర్ గుర్తు చేశారు. ఆ రోజు అతి కొద్దిమందితో ప్రారంభమైన ఆర్ట్ ఆఫ్ లింగ్ సంస్థ ప్రస్తుతం 25వేలకు పైగా టీచర్లతో.. ప్రపంచవ్యాప్తంగా 10వేలకు పైగా కేంద్రాలతో ప్రజల మానసిక ఒత్తిడిని నిర్మూలించేందుకు కృషిచేస్తోందని వెల్లడించారు.
అత్మ విశ్వాసం, దైవ విశ్వాసం, ధైర్యం ఉంటే ఎలాంటి పనినైనా చేయవచ్చని శ్రీశ్రీ రవిశంకర్ బోధించారు. ఇటీవల విజయవాడలో వరదలు వచ్చినపుడు కులమతాలకు అతీతంగా అందరూ కలసి పనిచేసిన తీరే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా దాదాపు 13 ఏళ్ల తర్వాత విజయవాడకు వచ్చిన శ్రీశ్రీ రవిశంకర్‌కు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరైన వేలాది భక్తులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం వారితో శ్రీశ్రీ రవిశంకర్ ధ్యానం చేయించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది లైవ్‌లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.
మనుషులంతా పుట్టుకతో పరిశుద్ధమైనవారేనని.. మానసిక ఒత్తిడి పెరగడం వల్ల స్వభావంలో మార్పులు కలుగుతాయని శ్రీశ్రీ పేర్కొ్న్నారు. సుదర్శనక్రియ, ధ్యానం, సత్సంగం ఒత్తిడిని తొలగించి అంతర్గతమైన స్వచ్ఛతను వెలికి తీస్తాయని చెప్పారు. యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం గురించి స్పందిస్తూ.. వారు పంచేంద్రియాలకు మించిన ఆనందం కోసం వెతికే ప్రయత్నంలో మత్తుకు బానిస అవుతున్నారని తెలిపారు. కానీ ఈ అలవాటు వ్యసనంగా మారి జీవితాలను నాశనం చేస్తుందని తెలిపారు. మత్తు పదార్థాల కంటే ఎన్నోరెట్ల ఆనందాన్ని ఆధ్యాత్మికత, సేవ అందిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతేడాది విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో లక్షలాదిమంది విద్యార్థులు మత్తుమందుల వాడకానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. విజయవాడ ప్రజలు కూడా ఆ దిశగా కృషి చేయాలని సూచించారు.
బిజినెస్‌మెన్ గోకరాజు గంగరాజు పుట్టినరోజు సందర్భంగా ఆయనను సత్కరించిన శ్రీశ్రీ రవిశంకర్.. 80 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా ఉత్సాహంగా సేవ చేస్తున్న గోకరాజు గంగరాజు స్ఫూర్తి అని ప్రశంసించారు. ఇక పిల్లలు సెల్‌ఫోన్ బారిన పడకుండా వారి అలవాటును మాన్పించేందుకు 2 రోజులపాటు ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టడం చేయడం మానేయండని సరదాగా శ్రీశ్రీ రవిశంకర్ చెప్పారు. ఇక్కడికి వచ్చిన వారంతా తమ సమస్యలను ఇక్కడే వదిలిపెట్టి చిరునవ్వుతో తిరిగి ఇళ్లకు వెళ్లాలని సూచించారు. ఏ ఒక్కరు విచారంగా కనిపించినా వారిని చిరునవ్వుతో పలకరించి.. తాము ఉన్నామని భరోసా ఇవ్వాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులకు సూచించారు.