ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలోనే నీటితో నడిచే హైడ్రోజన్ రైలు.. ఈ మార్గంలోనే అందుబాటులోకి!

national |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2024, 10:34 PM

దేశంలో పురాతన రవాణా వ్యవస్థ అయిన భారతీయ రైల్వేలు.. ప్రస్తుత కాలానికి తగ్గట్లు అప్‌డేట్ అవుతున్నాయి. ఇప్పటికే వందే భారత్ రైళ్లు, వందే మెట్రో రైళ్లను అందుబాటులోకి తీసుకురాగా.. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా పట్టాలు ఎక్కనున్నాయి. ఇక బుల్లెట్ రైలు ప్రాజెక్టు కూడా శరవేగంగా పూర్తి అవుతోంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మరో స్పెషల్ రైలు కూడా అందుబాటులోకి తీసుకురానుంది. అదే హైడ్రోజన్ రైలు. సాధారణంగా కొన్ని దశాబ్దాల క్రితం స్టీమ్ ఇంజిన్లతో నడిచే రైళ్లు.. ఆ తర్వాత బొగ్గు, డీజిల్‌తో నడిచే ఇంజిన్లు.. అనంతరం కరెంట్‌తో నడిచే రైళ్లు కూడా ఉండేవి. కానీ తాజాగా నీటితో నడిచే రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి.


హర్యానాలోని జింద్ - సోనిపట్ మార్గంలో దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. జింద్ నుంచి సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మధ్య ఈ హైడ్రోజన్ రైలు పరుగులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక 2025 నాటికి దేశ వ్యాప్తంగా 35 రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ ప్రణాళికలు చేస్తోంది. డీజిల్, కరెంట్ కాకుండా నీటితో నడవడంతో ఈ హైడ్రోజన్ రైలుతో పర్యావరణానికి కూడా ఎలాంటి హానీ జరగదని అధికారులు పేర్కొంటున్నారు.


ఈ హైడ్రోజన్ రైలు నీటితో నడుస్తుందని అధికారులు తెలిపారు. ఇందులో హైడ్రోజన్, ఆక్సిజన్‌లు విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. నీటి ఆవిరిని విడుదల చేసే టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఈ హైడ్రోజన్ రైలుకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్‌ ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ హైడ్రోజన్ రైలు 40 వేల లీటర్ల నీటిని ఉపయోగించుకుంటుందని తెలిపారు. ఈ హైడ్రోజన్ రైలు గంటకు గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని పేర్కొన్నారు. దీని శబ్దం కూడా చాలా తక్కువగానే ఉంటుందని.. ఒకసారి ఫ్యూయల్‌ ట్యాంక్‌ నింపితే వెయ్యి కిలోమీటర్లు ప్రయాణిస్తుందని వెల్లడించారు.


మొట్టమొదటి హైడ్రోజన్ రైలును హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా చేయనున్నారు. ఆ తర్వాత దేశంలోని పర్వత ప్రాంతాల్లో ఉన్న రైల్వే లైన్లు అయిన డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కా-శిమ్లా రైల్వేతో పాటు మరికొన్ని మార్గాలను రైల్వే అధికారులు పరిశీలనలో ఉన్నారు. ఇక ఈ హైడ్రోజన్ రైలును తయారు చేయడానికి ఒక్కదానికి రూ.80 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ హైడ్రోజన్ రైలులో టికెట్‌ ధర కూడా భారీగానే ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com