ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ (శుక్రవారం) పంచాయతీ వ్యవస్థపై చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అప్పటికే కొంత సమయం నుంచి జ్యోతుల నెహ్రూ ప్రసంగిస్తుండగా కలగజేసుకున్న రఘురామ.. ‘‘నెహ్రూ గారు సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు. అర్థం చేసుకోవాలి. ముగించండి’’ అని అన్నారు. సారీ... సారీ... కూర్చోమంటే కూర్చుంటా అని నెహ్రూ సమాధానం ఇచ్చారు. అయితే కూర్చోమని తాను అనడం లేదని, ప్రసంగాన్ని ముగించాలని మాత్రమే అంటున్నానని రఘురామ అన్నారు. ప్రతిస్పందించిన నెహ్రు... తనను ప్రతిపక్షంగా చూడకండి అని అన్నారు.‘‘నేను మాట్లాడడం మొదలుపెట్టి మూడు నిమిషాలు కూడా కాలేదు. అడ్డొస్తుంటే ఎలా! అధ్యక్షా మీతో వాదన నాకొద్దు. కూర్చోమంటే కూర్చుంటాను. నాకు ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే ముందు మాట్లాడినవారెవరూ నా కంటే సీనియర్లు కాదు. వారికి ఇచ్చిన సమయం నాకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈ సభపై ఉంది. మీరు ఇస్తానంటే ఓకే. లేదంటే నేను కూర్చుంటాను. సభకు కూడా రావొద్దంటే మానేస్తాను’’ అని అన్నారు. స్పందించిన రఘురామ... ‘‘సార్... మీరు మాట్లాడడం మొదలుపెట్టి గడియారంలో 12 నిమిషాలు అయ్యింది. ఫినిష్ చేయమని అంటున్నాను అంతే’’ అని అన్నారు. అయితే పదికి పదిసార్లు తనను అడ్డుకోవడం చూస్తుంటే తనను ప్రతిపక్షంగా భావిస్తున్నట్టుగా ఉందని, అది సరికాదని నెహ్రూ తిరిగి రిప్లై ఇచ్చారు.