అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లిన విద్యార్థులపై అక్కడి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం విపరీతంగా చర్చ జరుగుతోంది. ఇంతమంది ఇండియన్లు అమెరికాకు ఎందుకు వస్తున్నారని, డిగ్రీ కోసం కాకుండా అమెరికాలో ఉద్యోగం, వీసాల కోసం ప్రయత్నిస్తున్నారని యూజర్లు కామెంట్లు పెడుతున్నారు. అమెరికాలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం రెడ్డిట్ లో ఓ యువతి చేసిన పోస్టు ప్రస్తుతం చర్చకు దారితీసింది. అమెరికాలో పుట్టిపెరిగిన 26 ఏళ్ల యువతినంటూ చెప్పుకున్న సదరు యూజర్.. తాను కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ కోసం ఓ సాధారణ యూనివర్సిటీ కాలేజీలో చేరానన్నారు.తొలిరోజు క్లాసుకు వెళ్లినపుడు అక్కడున్న వారిని చూసి ఆశ్చర్యపోయానని వివరించారు. తన క్లాసులో 99 శాతం మంది విదేశీయులేనని, అందులోనూ ఇండియన్లేనని పేర్కొంది. ఆ యూనివర్సిటీ పెద్దగా పేరున్నదేమీ కాదని చెబుతూ.. ఇలాంటి కాలేజీలో ఇంతమంది విదేశీయులు చేరారంటే ఇదేమన్నా స్కామ్ అయి ఉంటుందా అని సందేహం వ్యక్తం చేసింది. ఇంతమంది ఇండియన్లు నిజంగా అమెరికాకు మాస్టర్స్ డిగ్రీ కోసమే వచ్చారా.. ఇక్కడ ఉద్యోగం సంపాదించుకుని, వీసా పొందాలని వచ్చే వారు చాలామంది నెలల తరబడి ఉద్యోగాల కోసం వెతుకుతున్నా దొరకడంలేదని చెప్పింది.ఎన్నో ఆశలతో వస్తున్న వారిలో చాలామంది యువతీయువకులు చివరకు బాధితులుగా మిగిలిపోతున్నారని సానుభూతి వ్యక్తం చేసింది. వారి పరిస్థితి చూస్తే, భవిష్యత్తుపై వారి ఆశలు వింటుంటే తనకు వారిపై జాలి కలుగుతోందని చెప్పింది. అదే సమయంలో క్లాస్ రూంలో వారి ప్రవర్తన సరిగా లేదని విమర్శించింది. ఓవైపు ప్రొఫెసర్ క్లాసు తీసుకుంటున్నా పలువురు విద్యార్థులు గట్టిగా మాట్లాడుతున్నారని, క్లాస్ రూంలో ఎలా ప్రవర్తించాలో వారికి తెలియదని ఎద్దేవా చేసింది.ఈ పోస్టుకు బదులిస్తూ.. అంతకుముందుతో పోలిస్తే ఇటీవలి కాలంలో అమెరికా వర్సిటీలలో చేరే భారత విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ఓ యూజర్ చెప్పారు. ఎడ్యుకేషన్ లోన్లు సులభంగా లభించడంతో పాటు యూనివర్సిటీల దరఖాస్తు విధానాలను సరళీకృతం చేయడమూ ఓ కారణమేనని వివరించారు. కాగా, అమెరికా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2022-23 విద్యాసంవత్సరంలో అమెరికాలోని వివిధ యూనివర్సిటీలలో చేరిన ఇండియన్ స్టూడెంట్ల సంఖ్య 2,68,923.. ఏటేటా దాదాపు ఇంతే మొత్తంలో భారత విద్యార్థులు అమెరికా వర్సిటీలలో చేరుతున్నారు.