తన భార్య ఆదిరెడ్డి భవానీని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో అసభ్యంగా ట్రోల్ చేశాయని టీడీపీ రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కారణంగా కుటుంబాలు ఎలా ఇబ్బందులు పడుతున్నాయనే అంశంపై అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న తన భార్య అసెంబ్లీలో మాట్లాడారని... దీంతో, ఆమెపై వైసీపీ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అప్పట్లో అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశామని... కానీ ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. స్పీకర్ స్థానాన్ని ఆయన అవమానపరిచారని విమర్శించారు. ఆనాడు తమ కుటుంబాన్ని ట్రోల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో జీవో అవర్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దిశ చట్టంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వంలో దిశ చట్టం లేకుండానే దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారని విమర్శించారు. దిశ చట్టానికి నిధులు కేటాయించారని... దీనిపై దర్యాప్తు జరపాలని కోరారు