ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థుల ఎంపికలో 1:100 విధానం అనుసరించాల్సిందే అంటూ ఏపీ సీఎం చంద్రబాబుని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. గ్రూప్ 2, డిప్యూటీ ఈవో పోస్టుల ఎంపికలో అనుసరించిన 1:100 విధానాన్నే గ్రూప్-1 విషయంలోనూ పాటించాలని షర్మిల కోరారు. ఇదే విషయమై కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారని ఆమె వెల్లడించారు. గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థుల ఎంపికపై షర్మిల మరోసారి సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. జీవో నంబర్ 5 ప్రకారం 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఏపీపీఎస్సీకి ఉందని వైఎస్ షర్మిల చెప్పారు.
ఆ అధికారాన్ని ఉపయోగించి 1:100 రేషియో ప్రకారం అవకాశం ఇవ్వమని గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు అడగడంలో న్యాయం ఉందంటూ ఆమె చంద్రబాబుకు తెలిపారు. 89 పోస్టులకు మీరిచ్చిన 1:50 రేషియో ద్వారా 4,450 మంది మాత్రమే మెయిన్స్‌కి అర్హత పొందారని, 1:100 రేషియో లెక్కన పిలిస్తే మరో 4,450 మందికి అవకాశం దక్కుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అలా ఎంపిక చేయాలని అభ్యర్థులు ఆశ పడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు.