ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. చంద్రబాబు నాయుడు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూ్ర్తి నాయుడు (72) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు.. నవంబర్ 14వ తేదీ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు నారా రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
నారా రామ్మూర్తి నాయుడుకు భార్య ఇందిర, ఇద్దరు కుమారులు నారా రోహిత్, గిరీశ్ ఉన్నారు. నారా ఖర్జూర నాయుడు, అమ్మణమ్మ దంపతులకు నారా రామ్మూర్తి నాయుడు రెండో కుమారుడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన రామ్మూర్తి నాయుడు తండ్రికి తోడుగా వ్యవసాయ పనుల్లో సాయం చేసేవారు. ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన తర్వాత రామ్మూర్తి నాయుడు నాటకాలపై ఆసక్తితో తిరుపతిలో కళా పరిషత్ ఏర్పాటు చేశారు. ఆ కళా పరిషత్ ద్వారా నాటకాలు వేశారు. నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చాత అన్నకు తోడుగా రామ్మూర్తి నాయుడు చేదోడు, వాదోడుగా ఉంటూ వచ్చారు. చంద్రబాబు కోసం ఇంటింటి ప్రచారం చేశారు.
సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
1992లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నారా రామ్మూర్తి నాయుడు..1994లో చంద్రగిరి నుంచి టీడీపీ తరపున కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణకుమారిపై పోటీ చేసి విజయం సాధించారు.1996,97,98లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కబడ్డీ సంఘం ఛైర్మన్‌గా పనిచేశారు. అయితే 1999 ఎన్నికల్లో మరోసారి పోటీచేసిన రామ్మూర్తి నాయుడు ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అనారోగ్యంతో రాజకీయాలకు దూరమయ్యారు. అయితే 2003లో ఢిల్లీలో సోనియా గాంధీ సమక్షంలో నారా రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ పార్టీ చేరారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమైన నారా రామ్మూర్తి నాయుడు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
మరోవైపు నారా రామమూర్తి నాయుడు మరణవార్త విని ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. తిరుగు పయనమయ్యారు. నారా లోకేష్ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. స్వగ్రామం నారావారిపల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి.