అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ.. సంచలన మార్పులకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత సరికొత్త నిర్ణయాలు, విధానాలు తీసుకోనున్నట్లు అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ కార్యవర్గంలోకి ఎన్నికైన భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటైన తర్వాత అమెరికా ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోతలు విధించే అవకాశం ఉందని తెలిపారు. దీంతో వివేక్ రామస్వామి చేసిన వ్యాఖ్యలు అమెరికాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇక ఉద్యోగాలు పోతాయని అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోత పడే అవకాశం ఉందని వివేక్ రామస్వామి తేల్చి చెప్పారు. ఇటీవల ఫ్లోరిడాలోని డొనాల్డ్ ట్రంప్ ఎస్టేట్ మార్ ఎ లాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వివేక్ రామస్వామి.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో లక్షల మంది ఫెడరల్ బ్యూరోక్రాట్లను బ్యూరోక్రసీ నుంచి మూకుమ్మడిగా తొలగించే పదవిలో తాను, ఎలాన్ మస్క్ ఉన్నట్లు చెప్పారు. అలా చేసి అమెరికాను తాము కాపాడాలి అని అనుకుంటున్నట్లు ఉద్యోగుల కోతలపై ముందస్తు సంకేతాలు ఇచ్చారు.
"ఎలాన్ మస్క్ గురించి ఇంకా మీకు తెలుసో లేదో.. ఆయన ఉలి కాదు రంపం తీసుకువచ్చారు. దాన్ని మేము బ్యూరోక్రసీపై ఉపయోగించాలి అని అనుకుంటున్నాం. గత 4 ఏళ్లలో బైడెన్ నేతృత్వంలోని డెమోక్రాటిక్ ప్రభుత్వవలో అమెరికా ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వస్తోంది. ఇప్పుడు మనం పతనం అంచున ఉన్నాం అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. మనం ఇలాగే కొనసాగకూడదు. ముందు ముందు మంచి రోజులు ఉన్నాయి. అమెరికాలో కొత్త పొద్దు పొడవనుంది. నిబద్ధత, కఠిన శ్రమతో అమెరికాను ముందుకు తీసుకెళ్లేందుకు మేం సిద్ధమవుతున్నాం. జాతితో సంబంధం లేకుండా నైపుణ్యం కలిగిన వ్యక్తులకు ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ఆశయం’’ అని వివేక్ రామస్వామి వెల్లడించారు.
అధికారం చేపట్టిన ట్రంప్.. తన గెలుపు కోసం కృషి చేసిన వారిని కీలక పదవుల్లో నియమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీకి నాయకత్వం వహిస్తారని ట్రంప్ తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థలో తీసుకురావాల్సిన కీలక మార్పులపై వీరు పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ డోజ్ విభాగం కోసం ఉద్యోగుల నియామకాలు కూడా ప్రారంభం అయ్యాయి. మస్క్, వివేక్ కోసం 80 గంటలు పనిచేసేవారు, హై ఐక్యూ ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని ట్విటర్‌లో ఓ పోస్ట్ కనిపించడం గమనార్హం.