టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ డికే ఆదికేశవులు కుమార్తె తేజస్విని, మనవరాలు చైతన్య శుక్రవారం తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి స్వర్ణ వైజయంతీ మాలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాతలు డీకే తేజస్విని, చైతన్య నుంచి టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్ స్వర్ణ వైజయంతీ మాలను శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో స్వీకరించారు. అనంతరం దాతలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ వైజయంతి మాల విలువ రూ.1కోటి ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు డీకే తేజస్విని, చైతన్యలు తిరుమల శ్రీవారికికూడా భారీ విరాళం అందించారు. సుమారు రూ.2కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతులమీదుగా అందజేశారు. ఈ ఆభరణాన్ని ఉత్సవమూర్తులకు టీటీడీ అలంకరించనుంది.
తిరుమలలో శుక్రవారం రాత్రి కార్తీకపౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శుక్రవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుంచి 8 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన స్వామివారు గరుడునిపై మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శాంతి, సూపరింటెండెంట్ మోహనరావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ రావు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో శుక్రవారం ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ముందుగా వేద మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ పద్మావతి, శ్రీ వేంకటేశ్వరుని చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదాల తయారీకి వినియోగించే యంత్రాలు, పాత్రలకు పూజలు చేశారు. అనంతరం అన్నదానం సిబ్బందిని అడిషనల్ ఈవో సన్మానించారు.
శృంగేరి శారద పీఠం ఉత్తరాధికారి శ్రీ విదు శేఖర భారతి తీర్థ స్వామీజీని టీటీడీ ఈవో శ్యామల రావు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతిలోని శృంగేరి శంకర పీఠానికి ఈవో దంపతులు శుక్రవారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఈవో దంపతులకు స్వామీజీ సత్కరించి ఆశీర్వచనం అందించారు. అనంతరం సనాతన ధర్మవ్యాప్తిని, వేద పరిరక్షణ , వేద విద్యావ్యాప్తికి టిటిడి చేపడుతున్న కార్యక్రమాలను ఈవో స్వామీజీకి వివరించారు.