రోజురోజుకూ సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఎవరైనా కొంచెం అజాగ్రత్తగా కనిపిస్తే చాలు.. వారి ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు. జనాలను సులువుగా మోసం చేస్తూ.. కోట్లకు కోట్లు కొట్టేస్తున్నారు. అయితే సాధారణ వ్యక్తుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఈ సైబర్ నేరాల బారిన పడుతున్న వారే ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. డబ్బులు పోయిన తర్వాత బాధితులు మోసపోయామని గుర్తించి.. అప్పుడు పోలీసులను, సైబర్ క్రైం అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏకంగా ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర మంత్రినే సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. అతని వద్ద నుంచి ఏకంగా రూ.2.08 కోట్లు స్వాహా చేశారు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న నంద్ గోపాల్ గుప్తా నందికి ఈ చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కుమారుడి పేరుతో ఆయన అకౌంటెంట్ రితేష్ శ్రీవాస్తవను మోసం చేసి సైబర్ నేరగాళ్లు రూ.2.08 కోట్లు కొట్టేశారు. రెండు రోజుల క్రితం.. మంత్రి నంద్ గోపాల్ గుప్తా అకౌంటెంట్ వాట్సాప్ నంబర్‌కు ఒక మెసేజ్ వచ్చింది. అది మంత్రి కుమారుడు ఫోటో డీపీగా ఉన్న వాట్సాప్ నంబర్. అయితే తాను ముఖ్యమైన బిజినెస్ మీటింగ్‌లో ఉన్నానని.. ఇది తన కొత్త నంబర్ అని.. వెంటనే తాను చెప్పిన అకౌంట్ నంబర్‌కు డబ్బులు పంపించాలని తెలిపారు. మీటింగ్ కారణంగా తాను మాట్లాడలేకపోతున్నానని.. తనకు అర్జంట్‌గా డబ్బులు కావాలని ఆ మెసేజ్‌లో ఉంది.
మీటింగ్ ఎక్కువసేపు పట్టే అవకాశం ఉందని.. కాబట్టి తనకు వెంటనే డబ్బులు పంపించాలని అకౌంటెంట్ రితేష్ శ్రీవాస్తవకు.. ఒక కొత్త నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. అయితే మంత్రి కుమారుడి ఫొటో డీపీగా ఉండటంతో అది నమ్మేసిన అకౌంటెంట్.. ఆ వాట్సాప్‌లో వచ్చిన అకౌంట్ నంబర్లకు 3 సార్లు డబ్బులు పంపించారు. ఈ క్రమంలోనే మొత్తంగా రూ.2.08 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అయితే ఈ విషయాన్ని ఆయన ఎవరికీ తెలియజేయలేదు. ఆ తర్వాత మంత్రి కుమారుడిని అడగ్గా.. తాను ఎవరికీ మెసేజ్ పంపలేదని.. డబ్బులు అడగలేదని తేలింది.
దీంతో సైబర్ క్రైమ్ జరిగిందని అప్పుడు గుర్తించారు. వెంటనే సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన రెండు సైబర్ క్రైమ్ టీమ్‌లు.. ఆ నేరగాళ్లను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఆ డబ్బులు ఎవరి ఖాతాల్లో, ఏ బ్యాంకులకు ట్రాన్స్‌ఫర్ అయ్యాయో గుర్తిస్తున్నారు. ఆ ఖాతాలు ఎవరి పేర్లపై ఉన్నాయో బ్యాంకు అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఆ బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేసేందుకు చర్యలు చేపట్టారు.