మహిళల కోసం ప్రత్యేకంగా ఓ బస్ డిపోను ఏర్పాటు చేసి.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల కోసం ఒక బస్ డిపోను ఏర్పాటు చేసింది. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్ ఈ మహిళా బస్ డిపోను ప్రారంభించారు. ఢిల్లీలోని సరోజిని నగర్‌లో పూర్తిస్థాయి మహిళా సిబ్బందితో కూడిన ఈ బస్ డిపోకు సఖి డిపోగా నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఈ బస్ డిపోలో డిపో మేనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు సహా అందరు సిబ్బంది మహిళలే ఉంటారని తెలిపారు. ఇక ఈ సఖి డిపోలో మొత్తం 225 మంది మహిళలను సిబ్బందిగా నియమించినట్లు మంత్రి కైలాష్ గహ్లోత్ వివరించారు.
ప్రస్తుత సమాజంలో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు.. రవాణా రంగంలోనూ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సఖి డిపోను ప్రారంభించినట్లు మంత్రి కైలాష్ గహ్లోత్ పేర్కొన్నారు. ఇప్పటికే చాలామంది మహిళలు బస్ కండక్టర్లుగా, ఇతర సిబ్బందిగా సేవలు అందిస్తున్నారని వివరించారు. ఇకపై బస్ డ్రైవర్లుగానూ మహిళలు తమలో ఉన్న ప్రతిభను బయటికి తీసి ప్రపంచానికి చూపిస్తారని కొనియాడారు. ఈ సఖి బస్ డిపో.. దేశంలో ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళా సాధికారతకు ఇలాంటి నిర్ణయాలు దోహదపడతాయని వెల్లడించారు.
అయితే దేశంలోనే తొలి మహిళా బస్ డిపోను ప్రారంభించడం మంచిదేనని పేర్కొన్న మహిళా ఉద్యోగులు.. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి ముందుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం రవాణా రంగంలో పని చేస్తున్న తమకు సరైన సౌకర్యాలు లేవని.. మహిళా ఉద్యోగులు మంత్రి కైలాష్ గహ్లోత్ ఎదుట నిరసనకు దిగారు. తమకు ఫిక్స్‌డ్ శాలరీ, ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామని హామీ ఇవ్వాలని మంత్రిని డిమాండ్ చేశారు. తాము విధులకు హాజరు కావాలంటే తెల్లవారుజామున 6 గంటలకే తమ ఇళ్ల నుంచి బయల్దేరి.. కొన్ని కిలోమీటర్ల ప్రయాణించాల్సి వస్తుందని పేర్కొ్న్నారు. ఒక్కోసారి సరైన సమయానికి తాము పని చేసే చోటుకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులతో మాట్లాడిన మంత్రి కైలాష్ గహ్లోత్ వారి డిమాండ్లు నెరవేరుస్తామని.. వారికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.