సాధారణంగా ఏదైనా పెళ్లిలో గొడవ జరిగిందంటే.. అది కట్నం దగ్గర అయినా లేక భోజనాల వద్ద అయినా అవుతుంది. కట్నం దగ్గర గొడవ అయితే రెండు కుటుంబాల మధ్యలోనే ఉంటుంది. కానీ భోజనాల దగ్గర గొడవలు జరిగితే మాత్రం అక్కడ తలలు పగిలిపోతాయి. ఆ పెళ్లికి వచ్చిన అతిథులు, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు.. ఆ గొడవలో కొట్టడమో, కొట్టించుకోవడం జరగడం మనం ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉంటాం. ఇక మటన్ మిగలలేదనో, ముక్కలు తక్కువ పడ్డాయనో అయ్యే గొడవలు వినడానికి చిన్నగానే అనిపించినా.. అవి మాత్రం చాలా పెద్దవిగా అవుతూ ఉంటాయి. ఇలాగే తాజాగా జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్ మీర్జాపూర్‌లో బదోహి బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ బింద్ ఏర్పాటు చేసిన ఓ విందులో కొందరు రణరంగం సృష్టించారు. ఈ నెల 14వ తేదీన మీర్జాపూర్‌లోని కర్సదాలోని వినోద్ బింద్ కార్యాలయంలో ఓ విందును ఏర్పాటు చేశారు. దీనికి చాలా మంది హాజరయ్యారు. అయితే వారికి భోజనం వడ్డించే సమయంలో ఓ వ్యక్తికి.. ఎంపీ డ్రైవర్ సోదరుడు మటన్ కర్రీ వేశాడు. కానీ అందులో ముక్కలు లేక కేవలం గ్రేవీ మాత్రమే ఉండటంతో సదరు వ్యక్తి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే ఆ ఎంపీ డ్రైవర్ సోదరుడిని దూషించాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరగడంతో మిగితా వారు కూడా వచ్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఆ తర్వాత ఈ ఘటనపై బీజేపీ ఎంపీ ఆఫీస్ వ్యవహారాలు చూసుకునే ఉమాశంకర్ బింద్.. ఈ ఘటనపై స్పందించారు. ఈ విందుకు చాలా మంది హాజరు అయ్యారని.. వారంతా తిని వెళ్లిన తర్వాత రాత్రి 8.30 గంటలకు కొందరు వ్యక్తులు తినడానికి వచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో వారు మద్యం సేవించి ఉన్నారని.. ఆ తర్వాత వారు వడ్డించే వాళ్లతో గొడవకు దిగినట్లు వెల్లడించారు. ఈ కొట్లాటలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. అతడ్ని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత.. కొందరు వ్యక్తులు.. ఆ విందు నుంచి కవర్లలో భోజనం, రోటీలు, మటన్ తీసుకెళ్తున్నట్లు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.