బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేంద్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా లేఖలు రాసింది. కేంద్రమంత్రి అమిత్ షా, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీలపై ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోపు అధికారిక వివరణ ఇవ్వాలని పార్టీల అధ్యక్షులకు రాసిన లేఖలో ఆదేశించింది.రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. మరోవైపు, అమిత్ షా కూడా కోడ్‌ను ఉల్లంఘించారని కాంగ్రెస్ ఈసీ వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలో నేతలపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని ఈసీ ఈ లేఖ రాసింది. అంతేకాదు, ఈ ఫిర్యాదులను ఇరుపక్షాలకు అందించింది.అధ్యక్షులకు రాసిన లేఖలో, ఇటీవల లోక్ సభ ఎన్నికల సందర్భంగా స్టార్ క్యాంపెయినర్లకు చేసిన సూచనలను ప్రస్తావించింది. జాతీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ఆదర్శంగా ఉండాలని, సమాజాంలోని సున్నితమైన కూర్పును చెడగొట్టవద్దని లోక్ సభ ఎన్నికల సమయంలో ఈసీ సూచించింది. ప్రచారంలో సంయమనం ఉండాలని పేర్కొంది.