దేశరాజధాని ఢిల్లీలో జరుగుతున్న హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. టెలీకాం రంగంలో డీరెగ్యులేషన్ వల్ల పురోగతి ఉంటుందని రిపోర్ట్ ఇచ్చామని.. దాన్ని అమలు చేయడం వల్ల టెలీకాం రంగం వృద్ధి చెందిందని తెలిపారు. సోషల్ మీడియాలో వేధించే సైకోలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ అనే విధానాన్ని తీసుకొస్తున్నామని.. దేశంలోనే ఇది తొలిసారిగా అమలు చేస్తున్నామన్నారు. తద్వారా ప్రజా సేవలను చివరి వ్యక్తి వరకు అందించాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ యుగంలో సమాచారమే ఓ పెద్ద నిధి అని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీలను ఉపయోగించి అన్ని రంగాల్లో పరిష్కారాలు వెతకొచ్చని తెలిపారు. ఒక స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచంలో ఏ మూల ఉన్నా మన పనులు చేసుకుంటూ పోవచ్చు అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.