ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు శనివారం కన్నుమూశారు. తమ్ముడి మరణవార్త విని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మరణంపై చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. ఎక్స్ వేదికగా తన బాధను పంచుకున్నారు.
"నా తమ్ముడు, చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడని బాధాతప్త హృదయంతో అందరికి తెలియచేస్తున్నాను. రామ్మూర్తి నాయుడు ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు అందించిన నాయకుడు. మా నుంచి దూరమైన మా సోదరుడు మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను." అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు,
మరోవైపు చిన్నాన్న రామ్మూర్తి నాయుడు మరణంపై నారా లోకేష్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తీవ్ర విషాదం నింపిందంటూ ట్వీట్ చేశారు." 'చిన్నాన్నతో చిననాటి నా అనుబంధం కళ్ల ముందు కదిలి వచ్చిన కన్నీటితో నివాళులు అర్పిస్తున్నాను. మౌనమునిలా మారిన చిన్నాన్న ఇన్నాళ్లూ మాకు కంటికి కనిపించే ధైర్యం..నేటి నుంచి చిరకాల జ్ఞాపకం. చిన్నాన్న ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. అంతులేని దుఃఖంలో ఉన్న తమ్ముళ్లు, పిన్ని దైర్యంగా ఉండాలని కోరుతున్నాను" అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
నారా రామ్మూర్తి నాయుడు మరణంపై వివిధ పార్టీల నేతలు సైతం నివాళులు అర్పిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. రామ్మూర్తి నాయుడు మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రామ్మూర్తి నాయుడు మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. రామ్మూర్తి నాయుడు చనిపోయారని తెలిసి చింతిస్తున్నానన్న పవన్ కళ్యాణ్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. చంద్రబాబు నాయుడుకు సానుభూతి తెలియజేసిన పవన్ కళ్యాణ్... మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉండటంతో అంత్యక్రియలకు రాలేకపోతున్నట్లు తెలియజేశారు,
మరోవైపు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు రేపు (ఆదివారం) స్వగ్రామం నారావారిపల్లిలో జరగనున్నాయి. రామ్మూర్తి నాయుడు భౌతిక కాయాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు తరలిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నారావారిపల్లెకు తరలించనున్నారు. ఆదివారం నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.