భూకబ్జాలపై పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పులివెందుల నియోజకవర్గంలో భూకబ్జాలు చేశారని ఆరోపించారు. వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులే తొండూరు మండలంలో 200 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమించి సాగు చేశారన్నారు.ప్రభుత్వ భూమిని యాభై వేల రూపాయలు రేటు కట్టి కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ చేశారని మండిపడ్డారు. దీని పైన విచారణ జరిగితే ఎమ్మార్వోలు, రిజిస్టర్లు ఇంటికి పోతారన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ అంబాకపల్లి గ్రామంలో అటవి శాఖ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటురన్నారని తెలిపారు.వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన వెనకేసుకొస్తున్న వాళ్ళందరూ భూ ఆక్రమణలకు పాల్పడ్డారని మండిపడ్డారు.
దేవిరెడ్డి శంకర్ రెడ్డి దొడ్ల వాగు గ్రామంలో 30 ఎకరాల భూమిని ఆక్రమించారన్నారు. పులివెందుల మున్సిపల్ చైర్మన్ డికెటి భూములు ఆక్రమించారని ఆ భూమి తనది కాదంటే తాము నిరుపేదలకు ఆ భూములు పంచుతామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరైనా భూ ఆక్రమణలు చేసి ఉంటే పులివెందుల ఆర్డీవోకు, డీఎస్పీకు, తనకు ఫిర్యాదు చేస్తే చర్య లు తీసుకుంటామని తెలిపారు. పులివెందుల్లో జరిగిన భూ ఆక్రమణలపై విచారణ చేపించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘నేను కానీ నా కుటుంబ సభ్యులు ఎవరైనా ఒక్క సెంటు భూ కబ్జా చేసినట్లు నిరూపిస్తే వైఎస్ కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పి రాజకీయ నుంచి తప్పుకుంటా’’ అంటూ బీటెక్ రవి సవాల్ విసిరారు.