భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెడుతూ శాసనసభలో ప్రతిపాదన చేశారు. పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనశాఖ మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి శాసనసభలో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు.గిరిజనుల పక్షాన పోరాటం చేసిన అల్లూరి బ్రిటీషర్లకు ముచ్చెమటలు పట్టించారన్నారు. చింతగొంది, కృష్ణదేవి పేట, రాజవొమ్మంగి పోలీసు స్టేషన్లపై దాడి చేసి బ్రిటీషర్ల గుండెలల్లో రైళ్లు పరిగెట్టించారని తెలిపారు. మన్యం వీరుడిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయన 125 జయంతిని పురస్కరించుకుని కాంస్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారని గుర్తు చేశారు. దేశం కోసం పోరాడిన వీరుడిని గుర్తుచేసుకోవడం అవసరమని వెల్లడించారు. గత ఐదేళ్ల పాటు భోగాపురం ఎయిర్ పోర్టును ఆలస్యం చేశారని మండిపడ్డారు. ఏజెన్సీలో పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు పేరును విమానశ్రాయనికి పెట్టాలని శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తోందని సీఎం తెలిపారు. ఆయన స్మారక మ్యూజియంను కూడా నిర్మించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. విప్లవ వీరుడి విగ్రహం పార్లమెంటులో కూడా ఉండాలని ఆకాంక్షించారు. అవసరమైతే ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి పేరు పెట్టే తీర్మానానికి శాసనసభ అమోదం తెలిపింది.