మూడు వారాల్లోనే అద్భుతంగా 50 లక్షల మైలురాయిని దీపం పథకంలో దాటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మహిళల కళ్లల్లో ఆనందం నింపే విధంగా దీపం2 పథకాన్ని సీఎం నారా చంద్రబాబునాయుడు ఇచ్చాపురంలో ప్రారంభించారని గుర్తుచేశారు. కృష్ణలంకలో దీపం పథకం కింద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్‌లను ఇవాళ(శుక్రవారం) మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కృష్ణలంకలో అందజేశారు.
ఉచిత గ్యాస్ సిలిండర్లను కృష్ణలంకలో ఈరోజు మహిళలకు అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... చంద్రబాబు 1999లోనే దేశంలోనే మొదటిసారిగా మహిళల ఆరోగ్య భద్రత గురించి ఆలోచన చేసి దీపం పథకం అమలు చేశారని.. ఉమ్మడి ఏపీలో గ్యాస్ బండలు ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు కోటి 55 లక్షల 200 గ్యాస్ కనెక్షన్ ఏపీలో ఉన్నాయని వెల్లడించారు.