గల్ఫ్ దేశాలకు అనంత అరటి ఎగుమతి అవుతోంది. ఈ సీజనలో తొలిసారిగా తాడిపత్రి రైల్వే స్టేషన నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బనానా రైలు ముంబాయికి అరటి దిగుబడులతో బయలుదేరనుంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బనానా రైలును విజయవాడ నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. పెద్దపప్పూరు, పుట్లూరు, యాడికి మండలాల్లో 45 మంది రైతులు పండించిన అరటి దిగుబడులను 34 కంటైనర్లల్లో తరలిస్తారు. మొత్తం రూ.1.50 కోట్ల విలువైన 680 మెట్రిక్ టన్నుల అరటిని తరలించనున్నారు. గుజరాతకు చెందిన ఎస్‌కే బనానా కంపెనీ రైతుల నుంచి అరటిని కొనుగోలు చేసింది. ఆ సంస్థ గల్ఫ్ దేశాలకు అనంత అరటిని ఎగుమతి చేస్తోంది. రైతుల వద్ద కిలో రూ.20 నుంచి రూ.22 ప్రకారం కొనుగోలు చేస్తోంది. విదేశాలకు ఉద్యాన పంటలను ఎగుమతి చేసేందుకు 2016లో రాష్ట్ర ప్రభుత్వం పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆరేళ్లుగా దేశాయ్, ఐఎనఐ తదితర కంపెనీల అరటిని విదేశాలకు ఎగుమతి చేస్తోంది. 2020 జనవరిలో కిసాన రైలు ద్వారా జిల్లా నుంచి అరటితోపాటు పలు రకాల ఉద్యాన పంటలను ఢిల్లీకి పంపారు. ఆ తరువాత రెండేళ్లకు కిసాన రైలు బంద్ అయ్యింది. అప్పటి నుంచి ప్రభుత్వంతో ఒప్పందం కుర్చుకున్న పలు కంపెనీలు రైతులలో అరటి పంటను కొనుగోలు చేసి, లారీలలో తరలిస్తున్నాయి. ఈ ఏడాది తిరిగి బనానా రైలు సేవలు మొదలయ్యాయి.