బోరుగడ్డను రెండు కేసుల్లో రెండు రోజులు పాటు కస్ట్టడికి అనుమతిస్తూ మంగళగిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాజమహేంద్రవరం నుంచి తుళ్లూరు తీసుకువచ్చి తిరిగి కోర్టులో హాజరు పరచడానికే సమయం సరిపోతుందని, విచారణకు సమయం చాలదని పోలీసులు కోర్టును అభ్యర్థించడంతో కస్టడి సమయాన్ని పొడిగించారు. దీంతో తుళ్లూరు సీఐ గంగా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బోరుగడ్డను రెండు రోజుల పాటు విచారించారు. విచారణ సమయంలో ఆయనను లాకప్‌లోనే ఉంచారు. చివరకు మధ్యాహ్న భోజనం కూడా లాకప్‌లోకే అందించారు.
కూర్చునేందుకు ఇనుప కుర్చీ ఇవ్వడంతో పాటు సాధారణ ఖైదీలు వెళ్లే బాత్రూం వినియోగించేలా చూశారు. ఈ ఏడాది మే 8న ఎన్నికల సందర్భంగా తుళ్లూరుకు రెండు కార్లలో వెళ్లి అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందిపై దౌర్జన్యం, దానిని చిత్రీకరిస్తున్న విలేకరిపై దాడితో పాటు దాబా హోటల్‌లోని సిబ్బందిని కత్తులతో బెదిరించి దౌర్జన్యం చేసిన ఘటనలపై బోరుగడ్డపై తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో బోరుగడ్డతోపాటు మరో నలుగురు వరకు పాల్గొన్నట్లు అప్పట్లో పోలీసులు గుర్తించారు. అయితే వారు ఎవరనేది తాజా విచారణలో బోరుగడ్డ నుంచి ముగ్గురి వివరాలు రాబట్ట గలిగారు. తన కారు డ్రైవర్ లాం గిరి, బంధువు సమర్పన్, రాజారావు తనతో పాటు పాల్గొన్నట్లు బోరుగడ్డ పోలీసులకు చెప్పాడు. బోరుగడ్డ చెప్పిన ముగ్గుర్ని అరెస్టు చేయాల్సి ఉంది. తనకు సయాటికా ఉందని విచారణకు అవకాశం ఇవ్వరాదని బోరుగడ్డ మేజిస్ర్టేట్‌కు సూచించగా అసలు సయాటికా ఎక్కడ వస్తుంది అని మేజిరేస్టట్ ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో విచారణ సందర్భంగా పోలీసులకు, కోర్టులకు సహకరించాలని మెజిరేస్టట్ ఆదేశించడంతో అలాగేనంటూ తల ఊపుతూ బోరుగడ్డ వెనుతిగాడు.