ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు.. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. నారా లోకేష్ నివాసంలో చాగంటి కోటేశ్వరరావు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. చాగంటి కోటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైతిక విలువల సలహాదారుగా ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్‌ను ఆయన నివాసంలో చాగంటి కోటేశ్వరరావు కలిశారు. విద్యార్థులకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తనను మర్యాదపూర్వకంగా కలిశారన్న నారా లోకేష్.. వివిధ అంశాలపై ఆయనతో చర్చించినట్లు వెల్లడించారు. విద్యార్థుల్లో మహిళలు, పెద్దలు, గురువులపై గౌరవం పెంపొందించేలా ప్రత్యేకంగా పాఠ్యాంశాలు రూపొందించాలని తీసుకున్న నిర్ణయం గురించి ఆయనతో చర్చించినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, సత్ప్రవర్తన పెంపొందించేందుకు సలహాలు, సహకారం అందిస్తానని చాగంటి కోటేశ్వరరావు అన్నట్లు నారా లోకేష్ తన ట్వీట్లో రాసుకొచ్చారు.
మరోవైపు ఏపీ నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో రెండుమూడు సార్లు పదవులు ఇస్తే.. ఆయన తీసుకోవడానికి అంగీకరించలేదు. టీడీపీ ప్రభుత్వం ఒకసారి, వైసీపీ సర్కారు మరోసారి ఆయనకు పదవులు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. అయితే అప్పట్లో వాటిని తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. దీంతో ఈసారి కూడా టీడీపీ కూటమి సర్కారు ఇచ్చిన నైతిక విలువల సలహాదారు పదవిని చాగంటి కోటేశ్వరరావు స్వీకరించకపోవచ్చనే వార్తలు వచ్చాయి. అయితే వాటన్నింటిని పక్కనపెడుతూ సలహాదారు పదవిని తీసుకునేందుకు చాగంటి కోటేశ్వరరావు అంగీకరించారు.
పిల్లలకు నాలుగు మంచిమాటలు చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇచ్చిన నైతిక విలువల సలహాదారు పదవిని అంగీకరించినట్లు ఇటీవల చాగంటి కోటేశ్వరరావు చెప్పారు. తన అంగీకారం పదవుల కోసం కాదన్న ఆయన.. పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించే బాధ్యత అప్పగించడాన్ని స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే తనకు 65 ఏళ్లు వచ్చాయని.. ఆరోగ్యంగా ఉన్న రోజుల్లోనే ఏమైనా చేయాలనే ఉద్దేశంతోనే దీనికి అంగీకరించినట్లు చెప్పారు. తన మాటలతో పిల్లలకు మంచి జరిగితే అంతకన్నా ఆనందం లేదన్న చాగంటి కోటేశ్వరరావు.. అందుకే సలహాదారు పదవిని స్వీకరిస్తున్నట్లు చెప్పారు. తాజాగా మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఈ విషయమై ఆయనతో చర్చించారు.