కేరళలోని త్రిసూర్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వల్పాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు పక్కన నివసిస్తున్న సంచార జాతుల గుడారాలను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు. లారీ ఢీకొన్న ఘటనలో గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.ఘటనపై సమాచారం ఇస్తూ, గాయపడిన ఐదుగురిని త్రిసూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చామని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పిల్లల్లో ఒకరికి ఏడాదిన్నర కాగా మరొకరికి నాలుగేళ్లు. మృతులంతా తమిళనాడు వాసులుగా గుర్తించారు. ఈ ఘటనకు కారణమైన లారీ డ్రైవర్, క్లీనర్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.