డిసెంబర్ నెల ప్రారంభమైంది. కొత్త నెల ప్రారంభమైన క్రమంలో కొన్ని ఆర్థిక పరమైన విషయాల్లో మార్పులు వస్తాయని తెలిసిందే. గత మూడు నెలల నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ వస్తున్న చమురు సంస్థలు ఈ నెల సైతం ధరల షాకిచ్చాయి. వాణిజ్య వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధర రికార్డ్ గరిష్ఠాల వైపు సాగుతోంది. ఒక్కో సిలిండర్‌పై రూ.16.50 పెంచుతున్నట్లు తెలిపాయి. ఎలాగే ఏటీఎఫ్ ధర 1.45 శాతం పెంచుతున్నట్లు వెల్లడించాయి. కొత్త రేట్ల వివరాలు తెలుసుకుందాం.
19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర మళ్లీ పెంచడంతో దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర రూ.1818.50కి చేరింది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో 19 కిలలో కమెర్షియల్ సిలిండర్ ధర రూ.1771గా ఉంది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.1980కి చేరింది. ధరల పెంపుతో గ్యాస్ వినియోగ వ్యాపారాలపై అదనపు భారం పడనుంది. మరోవైపు.. 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను సైతం పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. ఇవాళ్టి నుంచి నుంచి 5 కిలోల సిలిండర్ ధరలు ఒక్కోదానిపై రూ.4 పెరగనున్నాయి.
గత నెలలోనూ 19 కిలోల కమెర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను పెంచిన సంగతి తెలిసింది. ఒక్కో సిలిండర్‌పై రూ.62 మేర పెంచారు. ఈ నెల సైతం ధరలు పెంచడంతో వరుసగా 5వ నెలలో ధరలు పెంచినట్లయింది. దీంతో రెస్టారెంట్లు, హోటళ్లు వంటి ఎల్‌పీజీ గ్యాస్ పై ఆధారపడే వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. దీంతో ధరలు పెంచే అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగుతున్న కారణంగానే దేశీయంగా గ్యాస్ ధరలు పెంచాల్సి వస్తున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.
ఇక జెట్ ఫ్యూయల్ ఏటీఎఫ్ ధరలను 1.45 శాతం పెంచుతున్నట్లు తెలిపాయి. కిలో లీటర్ ఏటీఎఫ్‌కి రూ.1318.12 పెంచుతున్నట్లు తెలిపాయి. దీంతో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.91,856.84కు చేరింది. జెట్ ఫ్యూయల్ ధరలను పెంచడం ఇది వరుసగా రెండో నెల. గత నవంబర్ 1వ తేదీన జెట్ ఫ్యూయల్ ధరను రూ.2941.5 పెంచాయి.
అయితే... 14 కిలోల గృహ వినియోగ వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. వంట గ్యాస్ సిలిండర్ ధరలు గత కొద్దిన నెలలకు సామాన్య ప్రజలకు ఊరట కల్పిస్తూ ధరలను యథాతథంగా కొనసాగిస్తూ వస్తున్నాయి చమురు సంస్థలు. ఇక పెట్రోల్, డీజిల్ ధరల్లో సైతం ఎలాంటి మార్పు లేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్రోల్ ధరలను లీటరుపై రూ.2 తగ్గించగా అదే రేటు వద్ద కొనసాగిస్తున్నాయి.