ప్రస్తుతం నడుస్తున్నది డిజిటల్ యుగం. అన్నీ పనులు టెక్నాలజీతోనే చేయడం అవుతోంది. పేమెంట్స్ విధానం సైతం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు చెల్లింపు లావాదేవీలన్నీ ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే జరుగుతున్నాయి. ఇంకాస్త ఒక అడుగు ముందకెళ్లి.. స్మార్ట్‌వాచ్‌తోనే పేమెంట్స్ చేసే పరిస్థితి వచ్చేస్తోంది. ఒకప్పుడు వాచ్ అనేది కేవలం టైమ్ తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక గ్యాడ్జెట్ మాత్రమే. కానీ కాలక్రమేణ స్మార్ట్ వాచ్ అందుబాటులోకి రావడంతో వాచ్ రూపమే మారిపోయింది. ఇప్పుడు వాచ్‌తో చేయలేని పని లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫోన్ కాల్ మొదలు, హెల్త్ ట్రాక్ వరకు అన్ని రకాల పనులను వాచ్‌తోనే చేసే రోజులు నడుస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్‌టెల్ పేమెంట్స్, నాయిస్ కలిసి మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చింది. తాజాగా గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఎయిర్‌టెల్ ప్రముఖ స్మార్ట్‌వాచ్ కంపెనీ నాయిస్‌తో కలిసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు. త్వరలోనే ఈ వాచ్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) టెక్నాలజీకి సపోర్ట్ చేసేలా ఈ వాచ్‌ను డిజైన్ చేశారు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్‌లో డైరెక్ట్, ‘ఆన్ ద గో’ పేమెంట్స్ కోసం డయల్‌లో ఎంబెడెడ్ రూపే చిప్‌ను అమర్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.