సూర్యుడి వెలుపలి వలయమైన కరోనాపై అద్యయనం కోసం ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థ (ఈఎస్ఏ) చేపట్టిన ప్రోబా-3 ప్రయోగం చివరి నిమిషంలో వాయిదా పడింది. ఐరోపా స్పేస్ ఏజెన్సీకి చెందిన ఈ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ ద్వారా నింగిలోకి పంపనున్న విషయం తెలిసిందే. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి బుధవారం 4.05 నిమిషానిలకు రాకెట్ దూసుకెళ్లాల్సి ఉండగా.. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతికలోపం తలెత్తింది. చివరి నిమిషంలో దీనిని గుర్తించడంతో శాస్త్రవేత్తలు ప్రయోగం వాయిదా వేశారు. ప్రయోగానికి ముందు నిర్వహించే కౌంట్‌డౌన్ నిలిపివేశారు. ప్రోబా-3 ప్రయోగానికి సంబంధించిన 25 గంటల కౌంట్‌డౌన్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది.
అయితే, సూర్యుడిన్ని అధ్యయనం కోసం రూపొందించిన ఉపగ్రహంలో సాంకేతికలోపంతో ప్రయోగం నిలిపివేసినట్టు ఇస్రో తెలిపింది. సమస్యను పరిష్కరించిన తర్వాత ప్రయోగించున్నట్టు పేర్కొంది. అయితే, ప్రయోగాన్ని గురువారం నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రచండ భానుడి వెలుగల మధ్య మసకమసకగా ఉండే కరోనా చూడటం చాలా కష్టం. వీటిని అధిగమించి, కరోనాపై లోతైన పరిశోధనకు ఈఎస్ఏ ప్రోబా-3 ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. జంట ఉపగ్రహాలను నింగిలోకి పంపి, కృత్రిమ సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా కరోనాను అధ్యయనం చేయడం దీని ప్రత్యేకత.
ఈ జంట ఉపగ్రహాలను భూమి నుంచి 66 వేల కిలోమీటర్ల అత్యంత ఎత్తులోని దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అత్యంత ఎత్తులో ఉండే ఈ కక్ష్య ..ఉపగ్రహాలు గరిష్ట ఎత్తులో సుమారు ఆరు గంటల పాటు ఎగరడానికి తోడ్పడుతుంది. ఈ రెండు ఉపగ్రహాలు తమ కక్ష్యలో ఒక పరిభ్రమణాన్ని పూర్తిచేయడానికి 19.36 గంటల సమయాన్ని తీసుకుంటాయి. కక్ష్యలో భూమికి సుదూరంగా ఉండే బిందువులోకి రాగానే అవి ఒక నిర్దిష్ట పద్ధతిలో తిరిగేలా సంకేతాలు వెళ్తాయి. అక్కడ గురుత్వాకర్షణ ప్రభావం తక్కువగా ఉండటం వల్ల ప్రొపెల్లెంట్ వినియోగాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు, ఇది సరైన స్థాన నియంత్రణకు అనుమతిస్తుంది. ప్రోబా-3 అనేది 2001లో ఐరోపా స్పేస్ ఏజెన్సీ చేపట్టిన ప్రోబా-1 మిషన్‌కు కొనసాగింపు. ఈఎస్ఏకు చెందిన ఓ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించడం ఇదే మొదటిసారి.