ఈ విశ్వం గుట్టు విప్పడానికి, ఇతర గ్రహాలపై పరిశోధనలు జరపడానికి.. ప్రపంచ దేశాలు ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే అంతరిక్షంలోకి రాకెట్లను పంపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్న శాటిలైట్లు.. వాటి జీవితకాలం పనిచేసిన తర్వాత అక్కడే చెత్తగా మారతాయి. వందలాది శాటిలైట్లను అంతర్జాతీయంగా ప్రయోగించి.. వాటిని తిరిగి వెనక్కి తీసుకురాకపోవడంతో అవి అక్కడే పడి ఉన్నాయి. అయితే అంతరిక్షంలో ప్రధానంగా భూ దిగువ కక్ష్యలో భారీగా చెత్త పేరుకుపోయిందని ఎన్నో నివేదికలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే భూ కక్ష్యలో 14 వేల శాటిలైట్లు, 12 కోట్ల రాకెట్ శకలాలు ఉన్నాయని.. అమెరికాకు చెందిన ఓ కంపెనీ తాజాగా వెల్లడించడం ఇప్పుడు తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది.
ప్రస్తుతం భూ దిగువ కక్ష్యలో 14వేలకు పైగా ఉపగ్రహాలు తిరుగుతున్నాయని అమెరికాకు చెందిన స్లింగ్ షాట్ ఏరోస్పేస్ సంస్థ వెలువరించిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇందులో 3500 పనిచేయకుండా నిరుపయోగంగా ఉన్నాయని.. ఈ ప్రయోగాల కారణంగా 12 కోట్ల రాకెట్ శకలాలు కూడా ఉన్నట్లు తెలిపింది. వీటిలో కొన్ని ఓ భారీ ట్రక్కు పరిమాణంలో ఉన్నాయని వెల్లడించింది. ఇక ప్రపంచ దేశాలు ప్రయోగించే శాటిలైట్లు పెరుగుతుండటంతో.. భూ దిగువ కక్ష్య అంతరిక్ష వ్యర్థాలతో నిండిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్యానల్ అక్టోబర్ నెలలోనే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
అందుకే భూ దిగువ కక్ష్యను జాగ్రత్తగా ఉపయోగించుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని.. ఐక్యరాజ్యసమితి స్పేస్ ట్రాఫిక్ కో ఆర్డినేషన్ ప్యానెల్ తెలిపింది. ఇప్పటికే చాలా శాటిలైట్లను భూ కక్ష్యలోకి పంపించడంతో.. స్పేస్ ట్రాఫిక్ విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని.. ప్యానెల్ వైస్ ప్రెసిడెంట్ ఆర్తి హోల్లా మైని వెల్లడించారు. భూ కక్ష్యను కాపాడుకునేందుకు మనం చేపట్టాల్సిన చర్యలు చేయాల్సిందేనని తెలిపారు. ఇక శాటిలైట్లు ఒకదాన్ని మరొకటి ఢీకొనకుండా ఉండేందుకు వాటిని నిర్వహించే ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నేవిగేషన్, కమ్యూనికేషన్‌లకు తీవ్ర అంతరాయాలు రాకుండా ఉండాలంటే.. భూ దిగువ కక్ష్య సురక్షితంగా మారాలని ఆర్తి హోల్లా మైని పేర్కొన్నారు.
ఇక ప్రస్తుతం ప్రపంచంలో అంతరిక్ష ప్రయోగాలు చేయగల సామర్థ్యం ఉన్న దేశాలను సమన్వయం చేసేందుకు ఎలాంటి వ్యవస్థ లేకపోవడం కూడా ఈ వ్యర్థాలు పేరుకుపోతుండటానికి ఒక కారణంగా మారింది. దీని కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. తమ శాటిలైట్ సమాచారాన్ని పంచుకునేందుకు భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని దేశాలు అంగీకరించవు. ముఖ్యంగా ప్రజలు, సైనికుల ప్రయోజనాల కోసం ఉపయోగించే శాటిలైట్ల విషయంలో ఇలాంటి సమస్య తలెత్తుతోంది. ఇక వాణిజ్య సంస్థలు.. తమ రహస్యాలు బయటికి తెలుస్తాయని.. ఇలాంటి వ్యవస్థ ఏర్పాటుకు ఇష్టపడటం లేదు.
ఇక చైనాకు చెందిన ఓ రాకెట్ ఈ ఏడాది అంతరిక్షంలో పేలిపోయింది. జూన్‌లో రష్యాకు చెందిన ఒక శాటిలైట్ కూడా పేలింది. ఇక ఈ రెండింటి నుంచి వేలాది శకలాలు బయటికి రావడంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు దాదాపు గంటసేపు దాక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు.. భవిష్యత్‌లో వివిధ దేశాలు కలిసి.. వేలాది ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో ఆ శాటిలైట్లు ఒకదాన్ని మరొకటి ఢీకొనే ముప్పు ఎక్కువగా ఉంటుందని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటి కారణంగా వచ్చే 5 ఏళ్లలో ఈ నష్టాల విలువ రూ.4 వేల కోట్లకు పైనే ఉంటుందని మాంట్రియాల్‌లోని నార్త్‌స్టార్ ఎర్త్ అండ్ స్పేస్ సంస్థ తెలిపింది. నవంబర్ 27వ తేదీ నాటికి భూమి ఉపరితలం నుంచి 540-570 కిలోమీటర్ల ఎత్తులో స్టార్‌లింక్‌కు చెందిన 6764 శాటిలైట్స్ ఉన్నాయి. ఇక ఈ ఉపగ్రహాలు.. 2024 తొలి 6 నెలల్లోనే 50 వేల సార్లు ఢీకొనడాన్ని తప్పించుకునేందుకు వాటి మార్గాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.