స్త్రీలకు రుతుక్రమం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఇది సృష్టికి మూలం. ఎందుకంటే స్త్రీకి రుతుక్రమం రాకపోతే ఆమె తల్లి అవ్వలేదు. సృష్టి ఆరంభం అవ్వదు.స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు పరిపక్వం చెందని అండాలు రుతుస్రావం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. అందుకే స్త్రీలు ఈ నాలుగు రోజులు కూడా దైవ కార్యాలని కానీ పితృ కార్యాలను కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. వీటికి దూరంగా ఉండాలి. చాలామంది స్త్రీలలో ఉండే సందేహం ఏంటంటే ఈ మూడు రోజులు దీపారాధన చేయొచ్చా?, దేవుడిని పూజించవచ్చా?, గుడికి వెళ్లొచ్చా అని, మీకు కూడా ఈ సందేహం ఉన్నట్లయితే ఇప్పుడే తెలుసుకోవచ్చు.నిజానికి స్త్రీలు ఈ మూడు రోజులు కూడా ఎలాంటి దైవ కార్యాలలో పాల్గొనకూడదు. దీపారాధన చేయడం, పూజ చేయడం ఇలాంటివి కూడా చేయకూడదు. నిత్య పూజ చేసుకోవడం కూడా తప్పు అని శాస్త్రం చెప్తోంది. సూర్య నమస్కారాలు చేయడం వంటివి కూడా చేయకూడదు.
మూడు రోజులు తర్వాత దీపం పెట్టొచ్చా?, పూజ చేయొచ్చా?
ముట్టు మూడు రోజులు. ఈ మూడు రోజులు కూడా పైన చెప్పినట్లు ఎలాంటి వాటిని చేయకూడదు. నాలుగవ రోజు తల స్నానం చేయాలి. 5వ రోజు మారు స్నానం తర్వాత మాత్రమే దేవుడి గదిలోకి వెళ్ళాలి. అప్పటివరకు దూరంగానే ఉండాలి. మారు స్నానం చేశాక పూజ గదిలోకి వెళ్లి దీపారాధన చేయొచ్చు. అలాగే నిత్య పూజని చేయొచ్చు. ఎవరైనా వాయనానికి పిలిచినా 5వ రోజు మాత్రమే వెళ్లాలి. నాలుగు రోజులు కూడా పనికిరాదు. ఈ నాలుగు రోజులు కూడా తులసి మొక్కని ముట్టుకోవడం, తులసి మొక్కకి నీళ్లు పోయడం తులసి దళాలను కోయడం వంటివి కూడా చేయకూడదు.
వంట చేయకూడదా?
చాలా మందిలో ఈ సందేహం కూడా ఉంది. రుతుక్రమం సమయంలో ఇంట్లో పనులు చేసుకోకపోతే కష్టంగా ఉంటుంది. పిల్లల్ని స్కూల్ కి పంపించాలి. భర్తను ఆఫీస్ కి పంపించాలి. అలాంటప్పుడు వంట చేయకపోతే ఎలా? కష్టంగా ఉంటుంది కదా అని చాలామంది స్త్రీలు అడుగుతూ ఉంటారు. అయితే, నిజానికి వంట చేసుకోవడంలో తప్పులేదు. తప్పనిసరి అయినట్లయితే కచ్చితంగా వంట చేసుకోవచ్చు. కానీ వంట చేసుకునేటప్పుడు కొన్ని నిల్వ ఉండే వస్తువులని ముట్టుకోకుండా పక్కన ఉంచుకోవడం మంచిది.
మొత్తం బియ్యాన్ని కాకుండా కొద్దిగా పక్కకు ముందే పెట్టి ఉంచి వాడడం వంటివి చేయండి. అలా కాకూండా అంతా తాకితే, బియ్యానికి దోషం ఉంటుంది. రేపు ఏమైనా నైవేద్యంగా బియ్యంతో చెయ్యచ్చు. అప్పుడు పనికిరాదు. అందుకని ముందే కొంచెం నిల్వ ఉండే వస్తువుల్ని పక్కకు పెట్టుకుని వంట చేసుకోవాలి. నిల్వ ఉండే ఊరగాయలు వంటివి కూడా ముట్టుకోకూడదు.
కొంచెం పక్కకు తీసుకోవడం లేదంటే ఎవరినైనా ఇవ్వమనడం వంటివి చేయాలి. అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా వంట చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదు. నాలుగవ రోజు అన్ని వస్తువుల్ని తాకవచ్చు. కానీ దైవ కార్యాలకు, పితృ కార్యాలకు దూరంగా ఉండాలి. అలాగే దీపారాధన కూడా చేయకూడదు. ఐదవ రోజు నుంచి యధావిధిగా పూజ చేసుకోవచ్చు.
పసుపు, కుంకుమ, పూలు ఎప్పుడు పెట్టుకోవచ్చు?
రుతుక్రమం అయిన సమయంలో పసుపు, కుంకుమ, పూలు, కాటుక వంటివి పెట్టుకోకూడదని, చాలామంది పాటిస్తూ ఉంటారు. అయితే, నాలుగు రోజులు కూడా వీటిని పెట్టుకోకూడదు. ఐదవ రోజు మారు స్నానం చేసిన తర్వాత మాత్రం పసుపు, కుంకుమ, కాటుక, పూలు వంటివి పెట్టుకోవచ్చు.