ఈ రోజుల్లో చాలా మంది గార్డెనింగ్ ఇష్టపడుతున్నారు. చిన్న స్థలం ఉన్నా సరే అక్కడ మొక్కల్ని పెంచుతున్నారు. నగరాల్లో నివసించే ప్రజలు కుండీల్లో మొక్కల్ని నాటుతున్నారు. గ్రామాల్లో ఉన్న ప్రజలు తమ పెరట్లో కూరగాయలు, పూల మొక్కలతో పాటు కొన్ని ఔషధపు మొక్కల్ని పెంచతున్నారు. ఇక, సాధారణంగా గార్డెన్‌లో పూలు, పండ్లతో పాటు ఇతర గార్డెనింగ్ మొక్కల్ని పెంచుతుంటాం. మన పెరడు లేదా బాల్కనీలో కొన్ని రకాల మొక్కలను పెంచడం ద్వారా శారీరక, మానసిక, ఆరోగ్యపరమైన లాభాల్ని పొందవచ్చు.
అయితే, మొక్కలు పెంచాలి అన్న ఆలోచన ఉండే సరిపోదు.. వాటిని పెంచడం కూడా తెలిసి ఉండాలి. ఇక, చాలా మంది ఇంట్లో మొక్కలు బాగా పెంచినా కీటకాలు, పీడతో ఇబ్బంది పడతాయి. అయితే, వీటిని తరిమికొట్టడానికి రకరకాల రసాయనాలు వాడతారు. ఈ రసాయనాలతో నేల సారం దిబ్బతినడమే కాకుండా.. మొక్కలు కూడా నాశనమయ్యే ప్రమాదముంది. రసాయనాలకు బదులు ఇంట్లో దొరికే వాటితో మొక్కల కోసం టానిక్ తయారు చేయవచ్చు. ఈ టానిక్‌తో కీటకాలు పారిపోవడమే కాకుండా మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఇది ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
మొక్కల టానిక్ కోసం కావాల్సిన పదార్థాలు..
మజ్జిగ - ఒక బాటిల్
నీరు - 10 లీటర్లు..
వేప నూనె- రెండు గిన్నెలు
ఇలా తయారుచేయండి..
ముందుగా ఒక బాటిల్ నిండా మజ్జిగ తీసుకోని.. దాన్ని నీడలో 10 నుంచి 15 రోజులు ఉంచాలి. అప్పుడప్పుడూ రోజుకు ఒక్కసారైనా బాటిల్‌ని షేక్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. అప్పుడు ఈ సీనాలో మజ్జిగను ఒక పెద్ద బకెట్‌లో తీసుకోండి. ఈ మజ్జిగకు 10 లీటర్ల నీటితో పాటు రెండు పెద్ద గిన్నెల వేప నూనె యాడ్ చేయండి. ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. ఇంకేముంది.. కీటకాలను తరిమికొట్టే ద్రావణం సిద్ధం అవుతుంది.
వాడే పద్ధతి..
బకెట్‌లో తయారు చేసిన ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో తీసుకోండి. ఇప్పుడు ప్రతి వారం మొక్కలను పురుగుల నుంచి రక్షించడానికి పిచికారీ చేయండి. మీ మొక్కలలో కీటకాలు ఎక్కువగా ఉంటే.. వారానికి రెండు నుంచి మూడు రోజులు ఈ ద్రావణాన్ని పిచికారీ చేయవచ్చు. లేదంటే వారానికి ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మొక్కల నుంచి కీటకాల్ని తరిమికొడుతుంది.
వీటితో మొక్కలు ఏపుగా పెరుగుతాయి...
అరటి పండు తొక్క..
మనలో చాలా మంది అరటి పండు తిన్నాక.. తొక్కే కదా అని పారేస్తుంటాం. అయితే, అరటి తొక్కతో చాలా ప్రయోజనాలు ఉంటాయి. మొక్కలు ఏపుగా పెరగడానికి అరటి తొక్కలు వాడుకోవచ్చు. ఇందుకోసం.. అరటి తొక్కల్ని మొక్కల మొదళ్ల వద్ద వేసి.. దాని మీద కొద్ది మట్టి కప్పండి. అరటి పండు మట్టిలో కలిసిపోయి.. మంచి ఎరువుగా పనిచేస్తుంది. పూల మొక్కలకు కూడా ఇది బాగా పనిచేస్తుందట. పూలు బాగా పెద్దవిగా పెరుగుతాయంట.
పాలు..
మొక్కలు బాగా పెరగాలంటే పాలను ఎరువుగా వాడుకోవచ్చు. పాలలో ఉండే కాల్షియం, ప్రోటీన్ మొక్కలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి మొక్కను ఏపుగా పెంచుతాయి. పాలను ఎరువుగా వాడాలంటే.. ఒక చెంచా పాలను ఒక లీటరు నీటిలో కలపండి. ఇప్పుడు ద్రావణాన్ని మొక్కలకు పోయండి. ప్రతి నెలా ఈ ద్రావణాన్ని పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఉల్లిపొట్టు..
ఉల్లి పొట్టు కూడా మొక్కలకు సహజ ఎరువుగా పనిచేస్తుంది. మొక్కలకు చీడ పడ్డకుండా నివారించడంలో ఉల్లిపొట్టు కీలక పాత్ర పోషిస్తుంది. ఉల్లి పొట్టును అలా మొక్కల పొదల్లో వేసినా సరిపోతుంది. లేదంటే.. ఐదు లీటర్ల గోరు వెచ్చని వాటర్‌లో ఓ ఇరవై నుంచి ముప్పై గ్రాముల ఉల్లిపొట్టుని వేసి నాలుగు రోజుల పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మొక్కలపై పిచికారీ వేస్తే.. అవి బాగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.