చైనాలో చట్టాలు, శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో మనకు తెలిసిందే. చట్టాన్ని ఉల్లంఘించడమే కాదు.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ఉండేవారిని.. ఆనకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని కూడా కఠినంగా శిక్షించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక అవినీతి విషయంలో మొదటి నుంచీ జిన్‌పింగ్ ఉక్కుపాదం మోపుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు తేలితే వారికి కఠిన శిక్షలు విధిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చైనాలోనే అతిపెద్ద కుంభకోణం బయటికి రావడంతో ఆ కేసులో దోషిగా తేలిన ఓ ప్రభుత్వ అధికారికి ఉరిశిక్షను తాజాగా అమలు చేశారు. రూ.3500 కోట్ల భారీ కుంభకోణంలో ఓ అధికారి పాత్ర ఉందని తేలడంతో కోర్టు మరణశిక్ష విధించగా.. అతడికి ఉరివేశారు.
చైనాలోని నార్త్ మంగోలియాకు చెందిన మాజీ ప్రభుత్వ అధికారి లీ జియాన్‌పింగ్‌కు మంగళవారం ఉరిశిక్షను అమలు చేశారు. లీ జియాన్‌పింగ్ హయాంలో చైనాలోని అతిపెద్ద అవినీతి కేసు బయటపడింది. ఏకంగా 421 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.3,500 కోట్లకుపైనే అవినీతి వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో లీ జియాన్‌పింగ్ ప్రమేయం ఉన్నట్లు అధికారుల విచారణలో వెల్లడికావడంతో 2022లో చైనాలోని ఓ కోర్టు అతడికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది. ఇక ఆ కోర్టు తీర్పును లీ జియాన్‌పింగ్.. సుప్రీం పీపుల్స్ కోర్టులో సవాల్ చేయగా.. అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. లీ జియాన్‌పింగ్‌కు మరణశిక్ష విధించడం సరైందేనని.. సుప్రీం పీపుల్స్ కోర్టు సమర్థించడంతో అతనికి అధికారులు మంగళవారం ఉరిశిక్షను విధించారు.
చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ 2012లో అధికారం చేపట్టినప్పటినుంచి.. దేశంలో అవినీతిని అంతం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలోనే గతంలో జరిగిన అనేక అవినీతి కేసులను తవ్వి తీసి కారకులకు కఠిన శిక్షలు విధిస్తున్నారు. చైనాలో అవినీతి కేసులపై అధికారులు వేగంగా విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా మంది ప్రభుత్వ, సైనిక అధికారులతో పాటు.. జిన్‌పింగ్ పార్టీకి చెందిన వారు కూడా అవినీతి కేసుల్లో దోషులుగా తేలి జైలుశిక్షలు అనుభవిస్తున్నారు. తన సొంత పార్టీ నేతలు అయినా సరే అవినీతి చేస్తే కఠిన శిక్షలు తప్పవని ఇప్పటికే జిన్‌పింగ్ తీవ్ర హెచ్చరికలు చేశారు.