తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఓ ముఖ్య సమాచారాన్ని తెలియజేసింది. 2025 మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్లైన్ కోటా విడుదల తేదీలను టీటీడీ మార్పు చేసింది.ముందుగా నిర్ణయించిన ప్రకారం 2025 మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను డిసెంబర్ 23వ తేదీ ఉదయం ఆన్లైన్లో విడుదల చేయాల్సి ఉంది. అలాగే 2025 మార్చి నెలకు సంబంధించిన రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను డిసెంబరు 24న ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ ఇంతకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ తేదీలలో టీటీడీ మార్పులు చేసింది. మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీలు మారినట్లు టీటీడీ తెలిపింది. డిసెంబరు 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల ను, డిసెంబరు 26వ తేదీ ఉదయం 11 గంటలకు 2025 మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ను టీటీడీ విడుదల చేయనున్నట్లు సమాచారం.అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేస్తామని టీటీడీ ఓ ప్రకటనలో చెప్పింది.మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19 వరకూ తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలకు అనుమతిస్తారు. ఈ పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23వ తేదీ టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.