జైళ్లలో ఏళ్లుగా మగ్గిపోతున్న వయోవృద్ధులకు విముక్తి కల్పించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం శ్రీకారం చుట్టిందని ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం కదిరి సబ్‌జైలును తనిఖీ చేశారు. సబ్‌జైలులో ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందుతున్న ఆహార నియమాలు, ఆరోగ్య అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో కార్యదర్శి మాట్లాడుతూ.. సబ్‌జైలులో ఉంటూ 70 పదుల వయసు దాటినా బయటకు వచ్చే పరిస్థితిలేని వారి కోసం ఉన్నత న్యాయస్థానం మార్గనిర్దేశాలను జారీ చేసిందన్నారు. వయోవృద్ధుల జాబితాలను తయారు చేయమని ఆదేశించిందన్నారు. ఆనారోగ్యం బారినపడి ఆఖరి దశలో ఉన్న వారి వివరాలను కూడా ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. అలాంటి వారిపై కమిటీ వేసి, వారి పరిస్థితుల దృష్ట్యా సొంత పూచీకత్తుపై విడుదల చేయడమా, మరో మార్గాన్ని అన్వేషించడంలో భాగంగానే తనిఖీ చేస్తున్నామన్నారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఏళ్లుగా జైళ్లలో ఉంటున్న 70 ఏళ్లు దాటిన, అనారోగ్య పీడితులకు విముక్తి కలిగి, ఊరట లభించగలదన్నారు.