దేశంలో చాలా మంది చపాతీలు చేసుకుని తింటారు. ఉత్తర భారతదేశంలో చపాతీ లేదా రోటీ వారి భోజనంలో ముఖ్యమైన భాగం. చాలా మంది ఇళ్లల్లో గోధుమ పిండితో చేసిన చపాతీని దాదాపు తింటారు. చాలా మంది ఇళ్లల్లో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, నైట్ డిన్నర్‌లో చపాతీలను ఆహారంగా తీసుకుంటారు. కొందరు బరువు తగ్గాలనుకునేవారు రాత్రి సమయాల్లో చపాతీలు మాత్రమే తింటారు. చపాతీలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల చపాతీలు తినడం వల్ల రోజుకు సరిపడా శక్తి లభిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ, కొందరు మాత్రం చపాతీలు తినకూడదు. వీరు చపాతీలకు దూరంగా ఉండాలి. చపాతీలు ఎవరు తినకూడదో ఓ లుక్కేద్దాం.
అలసట సమస్యలు ఉన్నవారు..
చిన్న చిన్న పనులకే కొందరు అలసిపోతుంటారు. కొంచెం దూరం నడిచినా అలసట, ఆయాసంతో బాధపడేవారు చపాతీలు తినకపోవడమే మేలు అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఎందుకంటే గోధుమ పిండిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని బర్న్ చేయడం చాలా కష్టం. దీంతో.. రక్తంలో షుగర్ స్థాయిలు పెరుగుతాయి. ఈ ఎఫెక్ట్‌తో అలసట, నీరసం వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా శక్తి తగ్గడం వల్ల ఆకలి పెరుగుతుంది. అందుకే అలసట సమస్య ఉన్నవారు చపాతీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
డయాబెటిస్ రోగులు..
ప్రస్తుత కాలంలో డయాబెటిస్ అనేది అతి పెద్ద ముప్పుగా మారింది. డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది ఈ మహమ్మారితో బాధపడుతున్నారు. డయాబెటిస్ వచ్చిన వారి రక్తంలో షుగర్ లెవల్స్ హెచ్చు తగ్గులకు గురవుతాయి. అయితే, చాలా మంది డయాబెటిస్ పేషంట్లు రైస్ బదులు చపాతీలు తింటుంటారు. అయితే, వాళ్లు చేసే తప్పు ఇదే. షుగర్ రోగులు చపాతీలు తినకూడదంటున్నారు నిపుణులు. ఇందులో అమిలో పెక్టిన్ అనే స్టార్చ్ మూలాలు ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్ పెంచుతాయి. అందుకే షుగర్ ఉన్నవారు చపాతీలు ఎక్కువగా తినకూడదు. ఒక వేళ తినాలనిపిస్తే వైద్యుణ్ని సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.
అధిక బరువు లేదా ఊబకాయం..
ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు లేదా ఊబకాయ సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు బరువు తగ్గడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అన్నం మానేసి చపాతీలు తింటే బరువు తగ్గుతారని భావిస్తారు. అందుకే అన్నం బదులు చపాతీలు తింటారు. అయితే, ఇలా చేయడం వల్ల బరువు తగ్గకపోగా.. మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గోధుమ పిండిలో ఉండే గ్లూటెన్, కార్బోహైడ్రేట్లు శరీరంలో కొవ్వు నిల్వచేస్తాయి. ఈ కొవ్వు అంత ఈజీగా బర్న్ అవ్వదు. దీంతో.. బరువు పెరిగే ప్రమాదముంది. అందుకే ఇలాంటి వారు గోధుమ రొట్టెలకు దూరంగా ఉండాలి. గోధుమ పిండికి బదులుగా రాగి, జొన్న, సజ్జ పిండిలతో చేసిన రొట్టెలు తినడం మేలు.
థైరాయిడ్..
థైరాయిడ్ హార్మోను సవ్యంగా విడుదలైనప్పుడే శరీరంలో ప్రతి కణం సరిగ్గా పనిచేసి, జీవక్రియ పనితీరు బాగుంటుంది. ఆ హార్మోన్ విడుదలలో సమతుల్యం లోపిస్తే.. సమస్యలు తప్పవు. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు చపాతీలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గోధుమ పిండిలో గ్లూటెన్ అధికంగా ఉంటుంది. ఇది ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధుల ముప్పును పెంచుతుంది. దీంతో.. థైరాయిడ్ సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది. అందుకే ఈ సమస్య ఉన్నవారు చపాతీలు ఎక్కువగా తినకూడదు.
జీర్ణ సమస్యలు..
చాలా మందికి అజీర్తి, గ్యాస్, ఎసిటిడీ, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ఉంటాయి. ఇలాంటి వారు చపాతీల్ని ఎక్కువగా తినకూడదు. చపాతీలు ఎక్కువగా తినడం వల్ల అవి త్వరగా జీర్ణమవ్వవు. దీంతో.. మీ జీర్ణ సమస్యలు మరింతగా పెరుగుతాయి. గోధుమ పిండిలో ఉండే గ్లూటెన్ పేగుల్లో మంటకు కారణమవుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ లెవల్స్ పెంచుతుంది. దీంతో.. జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే ఈ సమస్యలతో బాధపడేవారు చపాతీల్ని ఎక్కువగా తినకూడదు.
రోజుకు ఎన్ని చపాతీలు తినాలి?
ప్రతి రోజు ఎన్ని చపాతీలు తినాలో కచ్చితంగా తెలుసుకోవాలి. ఎక్కువ చపాతీలు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ముప్పు ఉంది. ప్రతి రోజు మీడియం సైజులో ఉన్న చపాతీలను రెండు నుంచి మూడు తింటే సరిపోతుంది. అంతేకాకుండా గోధుమ పిండికి బదులు ఇతర తృణధాన్యాల పిండిని వాడి రొట్టెలు చేసుకుని తినడం మేలు. రోజూ బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లో చపాతీలు తినడం అంత మంచిది కాదు. చపాతీలు ఎక్కువ తినడం వల్ల ఆరోగ్యానికి ముప్పు కలగవచ్చని నిపుణులు అంటున్నారు.