బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో 184 పరుగుల తేడాతో ఓడిపోయిన టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచులు ముగిసే సరికి భారత్ 1-2తో వెనకబడి ఉంది. చివరి మ్యాచ్ జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. అయితే మెల్‌బోర్న్ టెస్టులో ఓడినప్పటికీ.. భారత ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరొచ్చా? భారత్ ముందున్న అవకాశాలేంటి?
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా జరగనుంది. ఇందులో ఆడేందుకు ఇప్పటికే దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు అర్హత సాధించింది. మరో బెర్తు కోసం ప్రధానంగా.. భారత్, ఆస్ట్రేలియా మధ్య పోటీ నెలకొంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో భారత్ 0-3 తేడాతో టెస్టు సిరీస్ ఓడిపోవడం భారత జట్టు అవకాశాలను దారుణంగా దెబ్బతీసిందనే చెప్పొచ్చు. డబ్ల్యూటీసీ 2025 సైకిల్‌లో టీమిండియా ఇంక ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీలో జరిగే ఐదో టెస్టులో గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సిడ్నీ టెస్టున డ్రా చేసుకున్నా.. ఓడిపోయినా కూడా.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించినట్లే. ఒకవేళ సిడ్నీ టెస్టులో భారత్ గెలిస్తే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమం అవుతుంది. దీంతో సిరీస్‌ను భారత్ రిటైన్ చేసుకుంటుంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత ఆస్ట్రేలియా.. శ్రీలంకలో పర్యటించనుంది. సిడ్నీ టెస్టులో భారత్ గెలిచి.. ఆసీస్‌తో సిరీస్‌ను 2-0, 1-0తో శ్రీలంక దక్కించుకుంటే.. భారత్ ఫైనల్ చేరుతుంది. ఈ సిరీస్ 0-0తో ముగిసినా.. టీమిండియాదే ఫైనల్ బెర్తు. ఇలా కాకుండా శ్రీలంకతో ఒక్క మ్యాచ్ గెలిస్తే.. భారత్ సిడ్నీ టెస్టులో గెలిచినా.. ఫైనల్ చేరలేదు. దీంతో ఇప్పుడు భారత్ ఫైనల్ చేరాలంటే.. సిడ్నీ టెస్టులో గెలవడంతో పాటు.. శ్రీలంకతో సిరీస్‌లో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ కూడా గెలవకూడదు.
ఇక డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఆస్ట్రేలియా ఇంకా మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. అందులో ఒక్క మ్యాచులో గెలిచినా.. ఫైనల్ సీటుపై ఖర్చీఫ్ వేసినట్లే. ఇలా కాకుండా.. సిడ్నీ టెస్టు డ్రాగా ముగిస్తే.. శ్రీలంక కూడా ఫైనల్ చేరేందుకు అవకాశాలు ఉంటాయి. ఆస్ట్రేలియాను 2-0తో ఓడిస్తే.. శ్రీలంక నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.