ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గుడ్‌న్యూస్.. ఎట్టకేలకు లోన్ వడ్డీ రేట్లు తగ్గింపు.. జనవరి 7 నుంచే అమల్లోకి.

business |  Suryaa Desk  | Published : Tue, Jan 07, 2025, 11:00 PM

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కీలక ప్రకటన చేసింది. ఇది కస్టమర్లకు శుభవార్త అని చెప్పొచ్చు. ముఖ్యంగా లోన్లు తీసుకునేవారికి ఇది ఊరట కలిగించే నిర్ణయం. చాన్నాళ్ల తర్వాత మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్  లెండింగ్ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీనినే రుణ ఆధారిత వడ్డీ రేట్లుగా చెబుతుంటారు. 5 బేసిస్ పాయింట్ల వరకు ఎంసీఎల్ఆర్ తగ్గించింది. వడ్డీ రేట్లను సవరించిన తర్వాత.. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఎంసీఎల్ఆర్ 9.15 శాతం నుంచి 9.45 శాతంగా ఉంది. సవరించిన ఈ ఎంసీఎల్ఆర్ రేట్లు 2025, జనవరి 7 నుంచి అమలులోకి వస్తుందని బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్లో వెల్లడించింది.


ఎంసీఎల్ఆర్ అంటే రుణ ఆధారిత వడ్డీ రేటు. అంటే లోన్లపై బ్యాంకులు వసూలు చేసే కనీస వడ్డీ రేటు అని చెప్పొచ్చు. ఇంతకంటే తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చేందుకు వీల్లేదు. అన్ని బ్యాంకులకు ఒకేలా విధానం ఉండాలన్న ఉద్దేశంతోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఎంసీఎల్ఆర్‌ను తీసుకొచ్చింది. ఎంసీఎల్ఆర్‌ను బట్టే బ్యాంకులు ఆయా రకాల లోన్లపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంటాయి. ఎంసీఎల్ఆర్ తక్కువగా ఉంటే.. లోన్లపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. అదే ఎంసీఎల్ఆర్ పెరిగితే.. లోన్ వడ్డీ రేట్లు పెరుగుతాయని చెప్పొచ్చు. అంటే ఎంసీఎల్ఆర్ తగ్గితే లోన్లపై ఈఎంఐ తగ్గుతుంది. ఎంసీఎల్ఆర్ పెరిగితే.. లోన్ ఈఎంఐ పెరుగుతుందని చెప్పొచ్చు.


ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు.. ఎంసీఎల్ఆర్ తగ్గించిన నేపథ్యంలో.. ఎంసీఎల్ఆర్‌కు లింక్ అయి ఉన్న హోం లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్ వంటి వాటిల్లో ఫ్లోటింగ్ రేట్ లోన్లు తీసుకున్నవారికి.. ఈఎంఐ తగ్గుతుందని చెప్పొచ్చు. ఫిక్స్‌డ్ రేట్‌పై తీసుకున్నవారిపై ప్రభావం చూపించదు.


ఇప్పుడు ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు తగ్గించగా 9.20 శాతం నుంచి 9.15 శాతానికి దిగొచ్చింది. ఒక నెల ఎంసీఎల్ఆర్ 9.20 శాతం వద్దే స్థిరంగా ఉంది. 3 నెలల ఎంసీఎల్ఆర్ 9.30 శాతం వద్ద యథాతథంగానే ఉంది. 6 నెలలు, ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు తగ్గి 9.40 శాతానికి దిగొచ్చింది. ఇక రెండేళ్ల ఎంసీఎల్ఆర్ కూడా 9.45 శాతం వద్దే ఉంది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు తగ్గి 9.50 శాతం నుంచి 9.45 శాతానికి పడిపోయింది. ఎక్కువగా ఏడాది, రెండేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్‌తో బ్యాంక్ లోన్స్ అనుసంధానమై ఉంటాయి. ఇవి మారితే లోన్ వడ్డీ రేట్లు మారుతాయన్నమాట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com