ఈ ఏడాది క్రికెట్ అభిమానులకు క్రికెట్ ఓవర్ డోస్ కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. దీని ఫైనల్ మార్చి 9 న జరుగుతుంది.ఈ టోర్నీ ముగిసిన వెంటనే ఐపీఎల్ (IPL 2025) జాతర జరగనుంది. దాదాపు రెండు నెలల పాటు జరిగే ఈ టోర్నీలో మరోసారి పది జట్లు ఆడనున్నాయి. ఈసారి కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగనున్న జట్లను ఒకసారి చూద్దాం.
పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ 2025 కోసం తమ జట్టులో భారీ మార్పులు చేస్తున్న జట్లలో పంజాబ్ కింగ్స్ ముందంజలో ఉంది. తరచూ కెప్టెన్లను మార్చడంలో ప్రసిద్ధి చెందిన ఈ జట్టు చాలా మంది ఆటగాళ్లను విడుదల చేసింది. మెగా వేలంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. గత ఏడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిల్ అందించిన అత్యంత ఖరీదైన ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌కు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు వస్తాయని చాలా మంది ఆశిస్తున్నారు. అయ్యర్ కెప్టెన్ అయితే అతని నాయకత్వంలో పంజాబ్ మొదటిసారి టైటిల్ గెల్చుకునే అవకాశం ఉంది.
కోల్‌కతా నైట్ రైడర్స్
శ్రేయాస్ అయ్యర్ జట్టు నుండి వైదొలగిన తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ KKR ఈ సంవత్సరం తన కెప్టెన్‌ని మార్చడం ఖాయంగా తెలుస్తోంది. క్వింటన్ డి కాక్ వంటి విదేశీ పేర్ల నుండి అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్ వంటి అగ్రశ్రేణి భారత ఆటగాళ్ల వరకు కెప్టెన్‌గా జట్టుకు చాలా మంచి ఎంపికలు ఉన్నాయి. ఈ పదవికి భారత ఆటగాళ్లు గట్టి పోటీదారులుగా కనిపిస్తున్నారు. అందువల్ల KKR జట్టు వెంకటేష్ అయ్యర్ లేదా రహానేని కెప్టెన్‌గా నియమిస్తుందని సమాచారం.
ఢిల్లీ క్యాపిటల్స్
ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకుంటే.. ఈ జట్టు మెగా వేలంలో కొన్ని ఆసక్తికరమైన పేర్లను జోడించింది. రిషబ్ పంత్ ఇప్పుడు జట్టులో లేడు. కానీ అతని స్థానంలో వచ్చిన కేఎల్ రాహుల్ ఈ స్థానానికి పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాడు. అతనితో పాటు, గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా ఉన్న ఫాఫ్ డు ప్లెసిస్ కూడా జట్టులో ఉన్నాడు. అయితే రాహుల్ మంచి ట్రాక్ రికార్డ్ కారణంగా కెప్టెన్సీని అందుకోగలడు.
లక్నో సూపర్ జెయింట్
రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను వదిలి లక్నో సూపర్ జెయింట్‌లో చేరాడు. జట్టు యజమాని సంజీవ్ గోయెంకా పంత్‌ను అత్యధికంగా బిడ్ చేసి అతనిని తన జట్టులోకి చేర్చుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టు కెప్టెన్సీని పంత్‌కు అప్పగించే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా కెప్టెన్‌గా పంత్ బాగానే రాణిస్తున్నాడు.