అర్ధరాత్రి వరకు టీవీ చూసి ఇంట్లో ఆదమరిచి నిద్రిస్తుండగా దొంగలు పడి రూ.10.50లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకుపోయారు. సమాచారం తెలుసుకున్న అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టణ సీఐ వీరబాబు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శివారు కురసాలవారి వీధిలో కోలా శేషు నివాసం ఉంటున్నాడు. సంక్రాంతి పండుగ కావడంతో భార్య, పిల్లలు పుట్టింటికి వెళ్లారు. శనివారం రాత్రి శేషు ఒక గదిలో, తల్లి మరో గదిలో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి వరకు టీవీ చూసిన శేషు ఆదమరిచి నిద్రపోయాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మెలకువ రావడంతో లేచి బాత్‌రూమ్‌కు వెళుతుండగా కిటికీ తలుపులు తెరిచి ఉండడాన్ని ఇంట్లో సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉండడాన్ని గుర్తించాడు. ఇంట్లో దొంగతనం జరిగిందని గ్రహించి వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. బీరువాకు తాళాలు వేసి ఉండకపోవడంతో పాటు లాకరు తాళాలు కూడా అక్కడే ఉండడంతో కిటికీ తలుపులు తెరుచుకుని లోనికి వచ్చిన దొంగలు బీరువాలోని 30 కాసుల బంగారు ఆభరణాలు, రూ.1.50లక్షల నగుదుతో కలిపి రూ.10.50లక్షల మేర అపహరించుకుపోయారు. సంఘటనా స్థలానికి డీఎస్పీ ప్రసాద్, సీఐ వీరబాబు సిబ్బందితో వచ్చి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. నేర ప్రదేశాన్ని పరిశీలించారు. డీఎస్పీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. క్లూస్‌టీమ్, డాగ్ స్క్వేడ్‌ను రప్పించి పలు ఆధారాలు సేకరించారు. అనుమానితుల నుంచి వేలిముద్రలను తీసుకున్నారు. శేషు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.