సంక్రాంతి పండగకు పిల్లలకు కొత్త దుస్తులు కొనాలని ఆనందంగా రాజమహేంద్రవరం మార్కెట్‌కు వెళ్తుండగా ప్రమాదం కబళించింది. ఈ ఘటనలో భార్య మృతిచెందగా భర్త తీవ్ర గాయాలపాలై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. రాజానగరం మండలం దివాన్‌చెరువు గ్రామానికి చెందిన గాడి గోపినాథ్, గాడి మేఘన (35) భార్యాభర్తలు. వారికి ఓ పాప, బాబు. గోపినాథ్ స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో ఎలక్ర్టీషియన్‌గా పనిచేస్తున్నాడు. సంక్రాంతి పండుగకు పిల్లలకు దుస్తులు కొనుగోలుచేసేందుకు ఇద్దరూ ఆది వారం సాయంత్రం రాజమహేంద్రవరం బైక్‌పై వెళ్తుండగా స్థానిక ఆటోనగర్ వద్దకు వచ్చేసరికి ఐషర్ వ్యాన్, కారు మధ్యకు వీరి బైక్ రావడంతో వ్యాన్ సైడ్ భాగం బ్యాక్ హ్యాండిల్ తగలడంతో ఇద్దరూ కింద పడిపోయారు. మేఘన వెనకకు పడడంతో తలకు బలమైన అక్కడికక్కడే మృతి చెందింది. గోపినాథ్ తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి బొమ్మూరు పో లీసులు చేరుకుని మేఘన మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. వ్యాన్‌ను, కారును అదుపులోకి తీసుకున్నారు.