ముఖ్యమంత్రి ఆదివారం సాయంత్రం తిరుచానూరులో ఏజీ అండ్ పీ కంపెనీ పైపులైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరాను ప్రారంభించారు. ఆయన విమానాశ్రయం నుంచి తిరుచానూరు పాత రేణిగుంట రోడ్డులో బనియన్ ఫ్యాక్టరీ సమీపంలో శరవణ, లీలావతి దంపతుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో పైప్డ్ నాచురల్ గ్యాస్ సరఫరాను స్విచాన్ చేసి ప్రారంభించారు. స్వయంగా స్టవ్ వెలిగించి పాలు కాచి టీ తయారు చేశారు. తన చేతులతోనే ఆ దంపతులకు, అలాగే మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి, కలెక్టర్ వెంకటేశ్వర్‌కు, ఎమ్మెల్యే పులివర్తి నానికి అందించారు. ఆ కుటుంబీకులతో కొంతసేపు ముచ్చటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శరవణ కుటుంబం సొంత ఇల్లు కట్టుకోవడానికి రూ.4 లక్షలు, పాడియావుల కొనుగోలుకు మరో రూ.2 లక్షలు.. మొత్తం రూ.6 లక్షల ఆర్థిక సాయాన్ని తక్షణం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సాక్షాత్తూ సీఎం తమ ఇంటికి వచ్చి స్వయంగా టీ కాచి అందించడం, తమతో కూర్చుని సమస్యలు అడిగి తెలుసుకోవడం, రూ.6 లక్షల తక్షణ ఆర్థిక సాయం ప్రకటించడంతో తమకు సంక్రాంతి ఒకరోజు ముందుగానే వచ్చిందంటూ ఆ కుటుంబం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది.