టీమిండియా నయా ఫినిషర్ 27 ఏళ్ల రింకూ సింగ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో అతడి నిశ్చితార్థం జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చాలా మంది ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే నిశ్చితార్థం విషయంపై అటు రింకూ గానీ.. ఇటు ప్రియా సరోజ్ అధికారికంగా స్పందించలేదు.
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చాడు రింకూ సింగ్. ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదిన ఈ ప్లేయర్.. ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. తన ప్రదర్శనతో ఏకంగా భారత జట్టులో చోటు సంపాదించాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రింకూ సింగ్‌ను ఐపీఎల్ 2025కి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రూ.13 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది. ఈ నేపథ్యంలో అతడు ఇటీవల యూపీ ఓ విల్లాను కొనుగోలు చేశాడు. త్వరలో ఇంగ్లాండ్‌తో జరగనున్న ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు.
తాజాగా రింకూ సింగ్‌కు సంబంధించిన ఓ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. తన సొంత రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీకి చెందిన లోక్‌సభ ఎంపీ ప్రియా సరోజ్‌తో రింకూ సింగ్ వివాహ నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని రింకూ సింగ్ గానీ, ఎంపీ ప్రియా సరోజ్ గానీ అధికారికంగా ప్రకటించలేదు.
రింకూ సింగ్ సోదరి నేహా సింగ్ తన తమ్ముడితో కలిసి తీసుకున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే, ఈ ఫోటోల్లో వారు నిల్చొని ఉన్న వెనుక వైపున డెకరేషన్ చేసి ఉంది. ఇది నిశ్చితార్థానికి సంబంధించిన ఏర్పాట్లేటనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, వధువు, నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను మాత్రం నేహా సింగ్ షేర్ చేయలేదు.
ప్రియా సరోజ్ ఎవరు..?
ప్రియా సరోజ్ గతేడాది ఉత్తర ప్రదేశ్‌లోని మచ్లిషహర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. 25 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికైన ఆమె.. లోక్‌సభ ఎంపీగా గెలిచిన రెండో పిన్న వయస్కురాలిగా నిలిచారు. ఈ ఎన్నికల్లో ఆమె బీజీపే నేత బీపీ సరోజ్‌పై 35 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ప్రియా సరోజ్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి తుఫానీ సరోజ్ మచ్లిషహర్ నియోజకవర్గం నుంచే వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు. ఆయన 1999, 2004, 2009లో హ్యాట్రిక్ విజయం సాధించారు. ప్రియా సరోజ్ ఢిల్లీ యూనివర్సిటీలో చదివి సుప్రీం కోర్టు లాయర్‌గా కూడా పనిచేశారు.