ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి తేదీలు వెలువడిన సంగతి తెలిసిందే. మార్చి 21 నుంచి కొత్త ఎడిషన్ ప్రారంభమవుతుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన కొద్దిరోజులకే మెగా లీగ్ అభిమానులతో సందడి చేయించనుంది. ఇక ఫ్రాంచైజీలన్నీ తమకు అందుబాటులో ఉన్న ప్లేయర్లతో క్యాంప్‌లు నిర్వహించేందుకు రెడీ అయిపోయాయి. ఈ క్రమంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కూడా సోమవారం రెండు విషయాల్లో కీలక ప్రకటనలు చేయనున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. అందులో ఒకటి కెప్టెన్సీ కాగా.. మరొకటి కొత్త జెర్సీని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ఐపీఎల్ మెగా వేలంలో భారత స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ ను రూ.27 కోట్లకు లఖ్‌నవూ దక్కించుకుంది. దీంతో అతడికే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం ఉంది. కానీ, పంత్‌కు గట్టి పోటీనివ్వడానికి నికోలస్ పూరన్ (Nicholas Pooran) ఉన్నాడు. మెగా ఆక్షన్‌కు ముందు రిటెన్షన్‌లో రూ. 21 కోట్లకు పూరన్‌ను ఎల్‌ఎస్‌జీ అట్టిపెట్టుకుంది. మరోవైపు ఆసీస్ టీ20 జట్టు సారథి మిచెల్ మార్ష్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఐదెన్ మార్‌క్రమ్ కూడా ఈ రేసులో ఉన్నారు. అయితే, గతేడాది కేఎల్ రాహుల్ (KL Rahul) స్థానంలో కొన్ని మ్యాచ్‌లకు పూరన్ నాయకత్వం వహించాడు. దిల్లీ కెప్టెన్‌గా ఉన్న పంత్‌ను భారీ మొత్తం వెచ్చించి మరీ సొంతం చేసుకుంది. లఖ్‌నవూ యజమాని సంజీవ్ గోయెంకా కూడా పంత్ పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పలువురు క్రికెటర్లు పాల్గొనే అవకాశం ఉందని లఖ్‌నవూ క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.