పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇదే సమయంలో ఈ ట్రోఫీ కంటే ముందు ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు సైతం జట్టును ఎంపిక చేసింది. ఈ మేరకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌లు మీడియా సమావేశంలో ఆటగాళ్ల పేర్లు ప్రకటించారు.
వెన్ను నొప్పితో సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయని.. జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో అతడిని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేశారు. ఇక ఇంగ్లాండ్‌తో సిరీస్‌తో పాటు.. ఛాంపియన్స్ ట్రోఫీకి కెప్టెన్ రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన తర్వాత అతడి స్థానంలో అనుమానాలు నెలకొనగా.. టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం రోహిత్‌పై విశ్వాసం ఉంచింది. అయితే అనూహ్యంగా వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేసింది.
ఇక సుమారు ఏడాదిగా భారత జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి ఎంపికయ్యాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న మహమ్మద్ షమీ సైతం జట్టులో స్థానం సంపాదించాడు. శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్న స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ సైతం జట్టులోకి వచ్చాడు. ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు ఎంపికయ్యారు. ఏకంగా నలుగురు ఆల్‌రౌండర్లను సెలక్టర్లు ఎంపిక చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ, యశస్వి జైశ్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా
వన్డే ఫార్మాట్‌లో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీకి ఆతిథ్య దేశంగా పాకిస్థాన్ ఉండగా.. భారత్ ఆడే మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరుగుతాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్..
ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో మ్యాచ్
ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో మ్యాచ్
మార్చి 2న న్యూజిలాండ్‌తో మ్యాచ్