ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం భారత జట్టును.. బీసీసీఐ శనివారం ప్రకటించనుంది. ముంబై వేదికగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌లు జట్టును ప్రకటించనున్నారు. అయితే ఈ జట్టులో ఎవరెవరికి చోటు దక్కుతుంది? ఎవరికి నిరాశ ఎదురవుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే భారత జట్టులో చోటు కోసం పలువురు ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారత జట్టులో రీఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూస్తున్న వారిలో కరుణ్ నాయర్ ఒకడు. విజయ్ హజారే ట్రోఫీలో సత్తాచాటుతున్న ఈ ప్లేయర్.. టీమిండియా జెర్సీ మరోసారి ధరించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీలో చెలరేగి పోయిన ఈ ప్లేయర్.. సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడా.. లేడా అన్నది ఆసక్తికరంగా మారింది.
జట్టు ప్రకటన నేపథ్యంలో కరుణ్ నాయర్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టాడు. "దేశం కోసం ఆడాలనే కలను ఇప్పటికే నెరవేర్చుకున్నా. కానీ ఆ కల ఇంకా సజీవంగానే ఉంది. అందుకే నేనింకా.. క్రికెట్ ఆడుతున్నానేమో. మంచి ప్రదర్శన చేయడమే నా చేతుల్లో ఉంటుంది. మిగతావన్నీ మనం నియంత్రణలో లేనివే. భారత జట్టుకు మళ్లీ సెలక్ట్ అవుతాననే నమ్మకం నాకు ఇప్పటికీ ఉంది" అని పేర్కొన్నాడు.
కాగా విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ సత్తాచాటుతున్నాడు. ఏడు ఇన్నింగ్స్‌లలో 752 పరుగులు చేశాడు. అందులో కేవలం ఒక్కసారి మాత్రమే ఔట్ అయ్యాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో నాటౌట్‌గా నిలిచాడు. ముఖ్యంగా గత ఇన్నింగ్స్‌లో 15 బంతుల్లో 55 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో అతడిని జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. సచిన్ టెండూల్కర్, హర్బజన్ సింగ్ లాంటి మాజీలు కరుణ్ నాయర్‌ను ప్రశంసించారు.
ఇక సంజూ శాంసన్ పరిస్థితి భిన్నంగా ఉంది. అతడు విజయ్ హజారే ట్రోఫీలో ఆడటం లేదు. ఎందుకు ఆడట్లేదనే విషయంపై కూడా క్లారిటీ లేదు. దీంతో అతడిని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. అయితే క్రీడా విశ్లేషకులు మాత్రం.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే జట్టులో కరుణ్ నాయర్, సంజూ శాంసన్‌లకు చోటు దక్కకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.