ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ ని కోల్ కతా కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. అతడికి న్యాయస్థానం రేపు (జనవరి 20) శిక్ష ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో, సంజయ్ రాయ్ తల్లి స్పందించారు. తన కుమారుడికి మరణశిక్ష విధించడమే సరైన చర్య అని వ్యాఖ్యానించారు. తనకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారని, ఆ ట్రైనీ డాక్టర్ పట్ల తన కుమారుడు ప్రవర్తించిన తీరును ఓ తల్లిగా ఎప్పటికీ క్షమించలేనని అన్నారు. కుమార్తెకు ఇటువంటి పరిస్థితి వస్తే ఆ తల్లి పడే వేదనను ఓ స్త్రీగా తాను అర్థం చేసుకోగలనని అన్నారు.మరణించిన ఆ జూనియర్ డాక్టర్ ను కూడా తన కుమార్తెలాగే భావిస్తానని పేర్కొన్నారు. సంజయ్ కి మరణశిక్ష విధించినా తాము ఎలాంటి అభ్యంతరం చెప్పబోమని, కాకపోతే, కొడుకు చనిపోయినందుకు కన్నీళ్లు పెడతానేమో అని వ్యాఖ్యానించారు.